The new groom Car accident : ఇంటి ముందు వేసిన పెళ్లి పందిరి తీయనేలేదు. కాళ్లకు పెట్టిన పారాణి ఆరనే లేదు. పెళ్లికి వచ్చిన బంధువులు ఇంకా ఇళ్లకు చేరనే లేదు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మంగళవాయిద్యాల నడుమ ఒక్కటైన ఆ జంట... విధి ఆడిన వింత నాటకంలో ఓడిపోయింది. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటానని ఒట్టుపెట్టిన ఆ భర్త... ఆరు రోజులకే ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. పెళ్లి సంబురం తీరక ముందే అతడికి నూరేళ్లు నిండాయి. కారు సర్వీసింగ్ కోసం వెళ్లిన నవవరుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.
Thomalapally car accident news : వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని తోమాలపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవరుడు సాయిచరణ్(27) మృతి చెందాడు. పెంట్లవెల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచి శశికళ, భాస్కర్ గౌడ్ దంపతుల కుమారుడు సాయిచరణ్ తన కారు సర్వీసింగ్ కోసం మంగళవారం మహబూబ్‌నగర్ వెళ్లాడు. పనులు ముగించికొని రాత్రి స్వగ్రామానికి వస్తుండగా పెబ్బేరు మండలం తోమాలపల్లి సమీపంలో కారు అదుపు తప్పి బోల్తాపడింది. కారు రోడ్డు మీదినుంచి కిందకుపడి... సాయిచరణ్ అక్కడికక్కడే మృతిచెందాడు.
ఇదీ చదవండి: Road accident: ప్రమాదంలో నవవధువు మృతి.. 'హేమ ఎక్కడంటూ' భర్త...
ఎంతకీ తిరిగిరాకపోవడంతో..
కారు సర్వీసింగ్ కోసం ఇంటికి వెళ్లిన కుమారుడు... ఎంతకీ తిరిగిరాకపోవడంతో తండ్రి భాస్కర్ గౌడ్ సాయిచరణ్‌కు ఫోన్ చేయగా... సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి పెంట్లవెల్లి నుంచి రోడ్డు వెంట వెతుకుతూ వచ్చారు. ఈ క్రమంలో తోమాలపల్లి వద్ద ప్రమాదాన్ని గమనించారు. అప్పటికే సాయిచరణ్ మృతిచెంది ఉన్నాడు. బంధువుల వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.... ఎస్సై రామస్వామి అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. సాయి చరణ్‌కు నవంబర్ 24న వివాహం జరిగింది. వివాహమై ఆరు రోజులు గడవకముందే ఈ ప్రమాదం ఇరు కుటుంబాలను తీవ్ర విషాదంలో ముంచింది.
ఇదీ చదవండి: పెళ్లైన మూడు రోజులకే కరోనాతో వరుడు మృతి
ఆమెకు తీరని వేదన
ఎన్నో ఆశల నడుమ మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టిన సాయిచరణ్ భార్యకు తీరని వేదన మిగిలింది. జీవితాంతం తోడు ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాదం చేసిన భర్త... కొత్త జీవితంలో అడుగుపెట్టిన ఆరు రోజులకే విధి ఆడిన వింత నాటకంలో బలయ్యాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారు. ఇరు కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి: Groom Suicide: 'కొత్తగా పెళ్లైనా రోజుకు 18 గంటల పని... మూడు నెలల జీతం ఆపేసి'