Free Fire Game effect: ఆన్లైన్ గేమ్ వ్యసనం ఓ బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. సెల్ఫోన్లో అదేపనిగా ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఆటకు విపరీతంగా అలవాటుపడిపోయి నరాలు చిట్లి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం చికిత్సపొందుతున్న ఆ బాలుడు.. తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేకపోతున్నాడు.
మూడు నెలలుగా
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి అదే పనిగా సెల్ఫోన్లో ఫ్రీ ఫైర్ ఆట ఆడుతున్నాడు. ఇలా దాదాపు మూడు నెలల నుంచి ఎవరు పిలుస్తున్నా పట్టించుకోకుండా ఉండేవాడు. క్రమంగా ఆ ఆటకు అలవాటు పడిపోయాడు. ఇలా ఆడుతూ ఆడుతూ రెండు రోజుల క్రితం ఆ బాలుడు ఇంటి వద్ద సృహ తప్పి పడిపోయాడు. గమనించిన తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి కర్నూలుకు తీసుకెళ్లాలని సూచించారు.
నరాలు చిట్లి
ప్రస్తుతం కర్నూలులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ విద్యార్థి.. తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేకపోతున్నాడు. కుమారుడి పరిస్థితి చూసి కన్నవారు బోరున విలపిస్తున్నారు. ఆటకు అలవాటు పడటంతో నరాలు చిట్లి అపస్మారక స్థితిలోకి వెళ్లాడని వైద్యులు చెప్పారు. కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఆన్లైన్ గేమ్ కోసం 78లక్షలు అప్పు- ఓటమితో ఆత్మహత్య