ఓ హత్యాయత్నం కేసు విచారణ సాగిస్తుంటే మూడేళ్ల క్రితం చోటుచేసుకున్న మరో హత్యోదంతం బయటపడింది. సినీ ఫక్కీని తలపించే ఈ ఉదంతంలో తవ్విన కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇల్లెందు మండలం ఇందిరానగర్ ఎంపీటీసీ సభ్యుడు మండలి రాముపై ఈ నెల 3న రాజకీయ కక్షతో హత్యాయత్నం జరిగింది. ఇటీవల అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిలో ఓ నిందితుడు 2018లో అదృశ్యమైన ఇల్లెందు కాకతీయనగర్‌కు చెందిన దైదా విజయ్‌కుమార్ (24) అలియాస్ శివ కేసు గురించి ఓ నిజం చెప్పాడు. దాని ఆధారంగా కూపీ లాగితే అతనిది అదృశ్యం కాదని, వేరే ప్రత్యర్థులు హతమార్చారని తేలింది.
2018లో ఏం జరిగింది?
సింగరేణి విశ్రాంత ఉద్యోగి కుమారుడు అయిన విజయ్‌కుమార్‌కు అయిదుగురు తోబుట్టువులున్నారు. పెద్దగా చదువు అబ్బలేదు. చిల్లర గ్యాంగ్‌లతో తిరిగేవాడు. అప్పట్లో వర్గ తగాదాల్లో తలదూర్చి పలు కేసుల్లో ఇరుక్కున్నాడు. ఈ గొడవలు ముఠా తగాదాలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన ప్రత్యర్థులు వలిపిరెడ్డి రాజ్‌కమల్ అలియాస్ కమ్ము (ఆటోడ్రైవర్), తంబల్ల కమల్ (లారీ డ్రైవర్), బాబు రాజ్ పాసి (కూలి) మరో ముగ్గురితో కలిసి విజయ్‌కుమార్ హత్యకు పథకం పన్నారు. 2018, సెప్టెంబరు 9న సాయంత్రం ఇల్లెందు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద అతడు ఒంటరిగా దొరకడంతో క్రికెట్ బ్యాట్లతో మూకుమ్ముడిగా దాడి చేశారు. దీంతో ఆ యువకుడు మృతిచెందాడు.
జరిగిందేమిటో తేల్చాలని..
అప్పటికే చీకటి పడుతోంది. ఎవరి కంటా పడకుండా శవాన్ని దగ్గర్లోని శ్మశానవాటికలో పూడ్చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అప్పట్లో స్థానిక ఠాణాలో అదృశ్యం కేసు నమోదైంది. ఆరోపణల నిరూపణకు పోలీసులకు సరైన ఆధారాలు లభించలేదు. తాజాగా ఎంపీటీసీ హత్యాయత్నం కేసులో ఓ నేరస్థుడి ద్వారా ‘విజయ్‌కుమార్’ది హత్యేనని తెలిసింది. జరిగిందేమిటో తేల్చాలని మణుగూరు ఏఎస్పీ శబరీష్‌ను ఎస్పీ ఆదేశించారు.
ఆధారాలతో రంగంలోకి..
సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎల్.ఆదినారాయణ, ఇల్లెందు ఎస్‌హెచ్‌ఓ, ఎస్సైలు రమేశ్, బి.శ్రీనివాస్, లక్ష్మీదేవిపల్లి ఎస్సై అంజయ్యతో కూడిన బృందం తెలిసిన ఆధారాలతో రంగంలోకి దిగింది. కమ్ము, కమల్, పాసిలను అదుపులోకి తీసుకుని విచారించింది. విజయ్‌కుమార్‌ను హత్య చేసినట్లు వారు అంగీకరించారు. మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని చూపించడంతో పోలీసులు రెండ్రోజుల క్రితం తవ్వి తీశారు. నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ శవం విజయ్‌కుమార్‌దేనని కుటుంబికులు గుర్తించారు. ముగ్గురు ప్రధాన నిందితులను కోర్టు రిమాండ్‌కు పంపామని, హత్యతో సంబంధం ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు సునీల్‌దత్, ఇల్లెందు డీఎస్పీ రవీందర్ వెల్లడించారు. పూర్తిస్థాయి విచారణ చేసి వారినీ అరెస్టు చేస్తామన్నారు.
ఇవీ చూడండి: చోరీకి వచ్చాడు.. అమ్మవారి ముఖం చూసి వెళ్లిపోయాడు..!