SI and Constable Suspended: నేరం రుజువయ్యే దాకా ఎంత పెద్ద కేసైనా అతడిని నిందితుడిగానే మన న్యాయవ్యవస్థ పరిగణిస్తుంది. అతడి ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా కాపాడుతుంది. కానీ క్షేత్రస్థాయిలో కొంతమంది పోలీసుల తీరు అందుకు భిన్నంగా ఉంటోంది. చిన్న చిన్న కేసుల్లోనూ... విచారణ పేరుతో నిందితులను చావబాదుతున్నారు. ఈ తరహా ఘటన నల్గొండలో చోటుచేసుకుంది.
నల్గొండ పట్టణంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని కొట్టిన కేసులో టూటౌన్ ఎస్సై నర్సింహులు, కానిస్టేబుల్ ఎస్.కె.నాగుల్ మీరాలను ఎస్పీ ఏ.వి.రంగనాథ్ సస్పెండ్ చేశారు. ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్లో ఎస్సై, కానిస్టేబుల్ కొట్టిన వ్యవహారం సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా వైరల్ అయ్యాయి. ఈ వీడియో ఎస్పీ రంగనాథ్ దృష్టికి రావడంతో ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించారు. ఎస్సై, కానిస్టేబుల్ తప్పిదం ఉన్నట్లు తేలడంతో ఇద్దరిని సస్పెన్షన్కు సిఫార్సు చేశారు. జిల్లా ఎస్పీ రంగనాథ్ సిఫార్సు మేరకు హైదరాబాద్ రేంజ్ డీఐజీ వి.బి.కమలహాసన్ రెడ్డి వీరిద్దని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నల్గొండ పట్టణానికి చెందిన రొయ్య శ్రీను (48) అనే వ్యక్తి ప్లాట్ల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని నవంబర్ 10వ తేదీన టూ టౌన్ పీఎస్ పరిధిలో కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో ఎస్సై నరసింహులు అదే రోజు శ్రీనును అదుపులోకి తీసుకుని.. విచక్షణ రహితంగా కొట్టారు. ఈ తతంగమంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ రంగనాథ్ దీనిపై విచారణ జరిపి.. సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: Telangana Police: ఖాకీల అత్యుత్సాహం.. వరుస సంఘటనలతో పోలీసుశాఖకు అప్రతిష్ట