మహిళతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి ఆమె కుమార్తెపైనా లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది.
మహబూబాబాద్ జిల్లాకు చెందిన మహిళ(32)కు 2006లో వివాహమైంది. కుమారుడు(17), కుమార్తె(15) ఉన్నారు. కుటుంబంలో గొడవల నేపథ్యంలో భర్తను వదిలేసి తన పిల్లలతో కలిసి ఆమె జీవనం సాగిస్తోంది. అదే ప్రాంతానికి చెంది సెంట్రింగ్ పనిచేసే బేతమాల కృష్ణ(35)తో ఆమెకు పరిచయం అయింది. తండ్రి స్థానంలో ఉంటానని నమ్మించడంతో అతనితో కలిసి సహజీవనం చేస్తోంది.
కొద్ది నెలల కిందట.. పనికోసం నగరానికి వచ్చి బంజారాహిల్స్ రోడ్ నంబరు 14 సమీపంలో పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. బోనాల పండుగ నేపథ్యంలో మెట్టుగూడ ప్రాంతంలో ఉన్న మహిళ తల్లి ఇంటికి కుమార్తెను పంపింది. తిరిగి వచ్చినప్పటి నుంచి కుమార్తె దిగులుగా, భయం భయంగా ఉండటంతో తల్లి ఆరా తీసింది.
ఈ నెల 7న ఇంట్లో ఎవరూ లేని సమయంలో కృష్ణ.. తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని కుమార్తె తల్లికి వివరించింది. దీనిపై కృష్ణను సదరు మహిళ నిలదీసింది. అది కాస్త గొడవకు దారితీయడంతో కృష్ణ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై.. ఆదివారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు మహిళ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: WOMEN MURDER: గుంటూరు మహిళ హత్య కేసులో... కోడలే నిందితురాలు