శివరాత్రి పండుగ సందర్భంగా ప్రజలందరూ ఆలయాల్లో పూజలు చేస్తుంటే.. దొంగలు మాత్రం దారి చూసుకుని దొరికింది దోచుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో శివరాత్రి రోజున పలు చోట్ల చోరీలు జరిగాయి. పట్టణ శివారులోని శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో తాళాలు పగులగొట్టి ఓ దుండగుడు లోనికెళ్లాడు.
అమ్మవారి ముఖం చూసి..
తలుపులు తీసి దేవుడి వద్దకు వెళ్లడంతో ఆ దొంగకు ఏమనిపించిందో ఏమో.. ఒక్కసారిగా అమ్మవారి ముఖం చూసి ఎలాంటి దొంగతనం చేయకుండా తిరిగి వెళ్లిపోయాడు. అనంతరం పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో షట్టర్ తాళాలు పగలగొట్టి దుకాణం కౌంటర్లోని నగదును దోచుకున్నాడు.
తిరిగి వెళ్తూ ఫ్రిడ్జ్‌లోని మద్యం బాటిళ్లను తీసుకెళ్లాడు. మరో రెండిళ్లలో తాళాలు పగులగొట్టి కొంత నగదుతో పాటు బంగారం దోచుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు చిత్రీకరించడంతో దోపిడీ బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: శివరాత్రి పూట రేవ్‌పార్టీ... పోలీసుల అదుపులో 90 మంది..