Inter students suicide :ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయామని ఏడుగురు.. మార్కులు తక్కువ వచ్చాయని ఒకరు మంగళవారం వివిధ ప్రాంతాల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మొత్తం ఎనిమిదిమంది చనిపోగా ఇందులో హైదరాబాద్ నగరానికి చెందిన నలుగురు విద్యార్థులు, పూర్వ ఖమ్మం జిల్లాకు చెందిన వారు ముగ్గురు, జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కొత్తపల్లికి చెందిన విద్యార్థిని ఒకరు ఉన్నారు. ఉత్తీర్ణత సాధించలేకపోయామని ముగ్గురు, తక్కువ మార్కులు వచ్చాయని ఒకరు నగరంలో తనువు చాలించారు.
telangana inter results : ద్వితీయ సంవత్సరం చదివే రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం నార్లకుంటతండా, బడంగ్‌పేట అన్నపూర్ణనగర్ విద్యార్థులు ఫెయిలయ్యామని ఆత్మహత్య చేసుకున్నారు. సైఫాబాద్ ఠాణా చింతలబస్తీకి చెందిన బాలుడు అన్నీ పాసయినా తక్కువ మార్కులు వచ్చాయని ప్రాణం తీసుకున్నాడు. ఉత్తీర్ణత సాధించలేదని కాటేదాన్ పారిశ్రామికవాడకు చెందిన ఫస్టియర్ విద్యార్థి స్థానిక ప్రజాప్రతినిధి సంబంధీకులకు చెందిన ఓ భవనం రెండో అంతస్తు నుంచి దూకాడు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు బాలుడు తండ్రితో మాట్లాడగా తన కుమారుడు మూర్ఛతో భవనం పైనుంచి పడి మృతి చెందిన్నట్లు తెలిపారు.
పాసవలేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజ్జులరావుపేటలో ఇంటర్ ప్రథమ విద్యార్థి బావిలో దూకి చనిపోయాడు. ఖమ్మం నగరంలో ఫస్టియర్ విద్యార్థి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కొత్తపల్లికి చెందిన ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థిని బావిలో దూకి చనిపోయింది.
తొందరపాటు చర్యలకు పాల్పడవద్దు.. ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని విద్యార్థులు ఎవరూ తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ఏడాది నష్టపోకుండా ఉండేందుకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని గుర్తు చేశారు.