Rape on Minors in Telangana : హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ పబ్ ఉదంతం వెలుగుచూసిన రోజుల తేడాలోనే రాజధానిలో నెక్లెస్‌రోడ్, మొఘల్‌పురా, కాలాపత్తర్‌తోపాటు నిజామాబాద్‌లో అఘాయిత్యాలు వరుసగా బహిర్గతమయ్యాయి. తల్లి పక్కన నిద్రిస్తున్న 9నెలల పసిపాపని ఎత్తుకెళ్లి అత్యాచారం చేయడం నుంచి మొదలుకొని పదిహేడేళ్ల బాలికను మభ్యపెట్టి అఘాయిత్యం చేయడం దాకా రాష్ట్రంలో ఎక్కడోచోట చిన్నారులపై అకృత్యాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
Rape on Minor Girls in Telangana : గతేడాది మైనర్లపై జరిగిన దారుణాలకు సంబంధించి 2,567 పొక్సో కేసులు నమోదయ్యాయి. కేసులు వేలల్లో ఉంటున్నా శిక్షలు పదుల్లోనే ఖరారవుతున్నాయి. ఆ ఏడాది 39 కేసుల్లో 44 మంది నిందితులకు పోలీసులు శిక్షలు వేయించగలిగారు. ఉదంతాలు వెలుగుచూసినప్పుడు చేస్తున్న హడావుడి, చూపిస్తున్న శ్రద్ధ తర్వాత కొరవడుతోందనేందుకు ఇదే నిదర్శనంగా కనిపిస్తోంది. కేసులు తేలే వరకు బాధితురాళ్లు, సాక్షులకు భరోసా కల్పించడంలో పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి.
అవయితేనే ఉరుకులు పరుగులు
వరంగల్‌లో పసికందుపై హత్యాచారం చేసిన నిందితుడికి 42 రోజుల్లోనే పోలీసులు శిక్ష వేయించగలిగారు. ఇలాంటి సంచలన కేసులు మినహా మిగిలిన పొక్సోకేసుల దర్యాప్తులో స్పందన అంతంతగానే ఉంటోంది. జాతీయ నేరగణాంక సంస్థ 2020 నివేదిక ప్రకారం ఆ ఏడాది చివరినాటికి తెలంగాణలో మొత్తం 4332 కేసులను దర్యాప్తును పూర్తిచేసిన పోలీసులు.. ఇంకా 2924(40.3శాతం) కేసుల్ని కొలిక్కి తేలేకపోయారు. ఈ విషయంలో దేశసగటు 36.8శాతం కావడం గమనార్హం.
Minor Girls Rape in Telangana : మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లాంటి పెద్దరాష్ట్రాలు ఈ విషయంలో మెరుగ్గా ఉన్నాయి. నిజానికి చాలా రాష్ట్రాల్లో లేని రీతిలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం తెలంగాణలో ప్రత్యేకంగా మహిళా భద్రత విభాగం పనిచేస్తోంది. బాధితురాళ్లతో ఫిర్యాదు చేయించేలా ఈ విభాగం విస్తృత ప్రచారం చేస్తోన్నా మెరుగైన ఫలితాలు కనిపించడంలేదు.
దొందూ దొందే..
పొక్సో కేసుల నమోదులో నగరాలు, పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాలూ తీసిపోవడం లేదు. రాజధానిలోని మూడు కమిషనరేట్లు మినహాయిస్తే పల్లేపట్నం తేడా ఉండటంలేదు. సెల్‌ఫోన్ రూపేణా అరచేతిలో అశ్లీలం.. మద్యానికి మాదకద్రవ్యాలు తోడుకావడంతో మత్తు తలకెక్కడం.. లాంటి వికృత పరిణామాలు మనిషిని మృగంగా మారుస్తున్నాయి. సంచలనం సృష్టించిన సైదాబాద్ సింగరేణి కాలనీ ఉదంతంలో రెండేళ్ల చిన్నారిని.. రాజు అనే కర్కోటకుడు కాటేసిన సమయంలో అతడు గంజాయి మత్తులో ఉన్నట్లు గుర్తించారు.
ఊరూరా వెలిసిన బెల్ట్‌షాపుల్లో రాత్రీపగలూ విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం.. గ్రామాల్లో అందుబాటులో ఉంటున్న గంజాయి.. అఘాయిత్యాల దిశగా ప్రేరేపించే ఉత్ప్రేరకాలుగా మారుతున్నాయి. గతేడాది తొలి ఆరునెలల గణాంకాల ప్రకారం హైదరాబాద్‌లో 197, సైబరాబాద్‌లో 226, రాచకొండలో 237 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఖమ్మం కమిషనరేట్‌లో 74, భద్రాద్రి కొత్తగూడెంలో 73, రామగుండం కమిషనరేట్, నల్గొండల్లో 69 చొప్పున, మహబూబ్‌నగర్‌లో 62 కేసులు వెలుగుచూశాయి. ఈ గణాంకాల్ని బట్టి రాజధాని మినహా మిగతా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇలాంటి అకృత్యాలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.