Fake Certificates Case Updates : నకిలీ ధ్రువపత్రాల వ్యవహారంపై హైదరాబాద్ ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ కేసులో తాజాగా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ భోపాల్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణ వర్సిటీకి చెందిన గతంలో వీసీగా పని చేసిన కుష్వా, తాజా వైస్ ఛాన్సెలర్ ప్రశాంత్ పిళ్లైలను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏడుగురు ఏజెంట్లు, 19 మంది విద్యార్థులు, ఆరుగులు తల్లిదండ్రులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. తాజాగా ఈ దందాలో యూనివర్సిటీ వీసీలను అరెస్టు చేయడం చర్చనీయాంశమవుతోంది.
VC arrest in Fake Certificates Case : ఏజెంట్ల ద్వారా విద్యార్థుల వివరాలు తీసుకుని ఒక్కో కోర్సుకు ఒక్కో రేటు నిర్ణయించి దందా చేస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారానికి సంబంధించి ఫిబ్రవరిలో హైదరాబాద్ మలక్‌పేటలో మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదుకాగా.. ఆ తర్వాత ఆసిఫ్‌నగర్, చాదర్‌ఘాట్, ముషీరాబాద్‌లో కేసులు నమోదయ్యాయి. అర్హత లేకుండా సర్టిఫికెట్లు పొంది కొంతమంది విదేశాలకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సర్వేపల్లి యూనివర్సిటీలో వీసీ కుష్వా(2017) పనిచేస్తున్నప్పటి నుంచి ఈ దందా సాగుతున్నట్లు గుర్తించామని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని ఏడు రాష్ట్రాల్లో పలు యూనివర్సిటీల్లో ఏడు సిట్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని హైదరాబాద్ నేర విభాగ అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు.