హరితహారంలో నాటిన మొక్కలపై.. గ్రామస్థులు, ఓ మండల స్థాయి ప్రజాప్రతినిధి మందలించారంటూ మనస్తాపానికి గురైన ఓ మహిళా సర్పంచ్ పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దేవునిపల్లిలో జరిగింది.
మంగళవారం.. దేవునిపల్లిలోని నంబులాద్రి దేవాలయం పరిసరాల్లో ప్రజారోగ్య గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సుల్తానాబాద్ ఎంపీపీ బాలాజీరావు, గ్రామ ప్రజలు... సభ ముగిసిన వెంటనే ఆలయ ఆవరణలో మొక్కలు నాటడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కొందరు స్థానికులు తెలిపారు. ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటితే జాతర జరిగినప్పుడు భక్తులకు ఇబ్బంది కలుగుతుందని... ఎంపీపీ బాలాజీరావు.. కాస్త ఘాటుగా చెప్పినట్లు సమాచారం. ఈ ఘటనపై మనస్తాపానికి గురైన కోమల.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు. హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.
పురుగుల మందు తాగలే..!
ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు... సర్పంచి కోమలని ప్రశ్నించగా.. ప్రజారోగ్య సభలో పెద్ద గొడవ జరగలేదని.. అసలు తాను పురుగుల మందు తాగలేదని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. తన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడం వల్లే.. కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకున్నట్లు ఆమె చెప్పారు.
గొడవ జరిగింది.. కానీ..
ఇదే విషయమై సుల్తానాబాద్ ఎంపీపీ బాలాజీరావుని వివరణ కోరగా.. కార్యక్రమంలో గొడవ జరిగింది నిజమేనని... కేవలం ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటడం వల్ల ఇబ్బంది కలుగుతుందని... చెప్పామన్నారు. అంతకు మించి తనకేమీ తెలియదంటూ ఎంపీపీ... అక్కడ నుంచి నెమ్మదిగా జారుకున్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని సుల్తానాబాద్ పోలీసులు వెల్లడించారు.
ఇదీచూడండి: Viral : నిందితుల నిర్లక్ష్యానికి నిదర్శనమే ఈ దృశ్యాలు