ఈనెల 15న తన రెండు నెలల కుమారుడు కిడ్నాప్‌కు గురయ్యాడంటూ ఓ మహిళ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు రోజుల వ్యవధిలో కేసును ఛేదించారు. కన్న తండ్రే విక్రయించారని తేల్చారు. బాలుడిని విక్రయించిన తండ్రితో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల 40 వేలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఎంఎం పహాది కాలనీకి చెందిన సయ్యద్ హైదర్ అలీ ఆర్థిక సమస్యల కారణంగా తన కుమారుడిని.. హజీరా బేగం, రేష్మ బేగంలకు రూ. 3 లక్షల 80 వేలకు విక్రయించాడు. అందుకు అబ్దుల్ రియాజ్, షాహెదా బేగంలు మధ్యవర్తులుగా వ్యవహరించారు. బాబు కనిపించకపోవడంతో.. తల్లి షహనా బేగం పోలీసులను ఆశ్రయించింది.
బాబును సురక్షితంగా మళ్లీ తల్లి ఒడికి చేర్చడంతో.. ఆమె ఊపిరి పీల్చుకుంది. కేసు ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులకు సీఐ కనకయ్య రివార్డులు అందజేశారు. ఎస్ఐ శ్రీధర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.
ఇదీ చదవండి: రణరంగంగా మారిన ఇల్లంతకుంట పోలీస్‌స్టేషన్