అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ పరిధిలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి కొత్తగూడ పైవంతెన సమీపంలో రెండు మృతదేహాలు పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హోండా ఆక్టివా ఆధారంగా మృతుడు చిలకలగూడ పీఎస్ పరిధిలోని వారాసిగూడకు చెందిన ఎడ్ల యశ్వంత్గా గుర్తించారు. యశ్వంత్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతురాలి బ్యాగులో లభించిన వివరాలను బట్టి వారాసిగూడకే చెందిన జ్యోతిగా తేల్చారు. జ్యోతికి భర్త, ఇద్దరు పిల్లలున్నారు. ఆమె భర్త స్టీల్ సామాను విక్రయించి కుటుంబాన్ని పోషిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలో మృతదేహాలు రెండు నగ్నంగా పడి ఉన్నాయి. యశ్వంత్ గుండె, మర్మాంగంపైన హంతకులు స్క్రూ డ్రైవర్‌తో దాడి చేశారు. జ్యోతి తలపై రాయితో మోదారు. మృతదేహాలు ఉబ్బిపోయి గుర్తుపట్టలేని విధంగా మారాయి. మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న యశ్వంత్ సోదరుడు.. గతంలో తమ కాలనీలో చిన్న చిన్న గొడవలు జరిగాయని... అవేవీ హత్య చేసే అంతటి కారణాలు కావని తెలిపాడు.
ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో హోండా ఆక్టివా తీసుకొని ఇంట్లో నుంచి బయల్దేరిన యశ్వంత్, జ్యోతిని తన వెంట తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడకు వెళ్లి నిర్మానుష ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఇద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో హంతకులు పక్కా ప్రణాళిక ప్రకారం దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరూ కలిసి హోండా ఆక్టివాపై బయల్దేరినప్పటి నుంచి హంతకులు వెంబడించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఏకాంతంగా గడుపుతున్న సమయంలో మరీ దాడి చేయడాన్ని బట్టి హంతకులు ఎంత పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరించి ఉంటారని పోలీసులు ఆరా తీస్తున్నారు.
తలపై రాయితో దాడి చేయడంతో పాటు.. స్క్రూ డ్రైవర్ తో దాడి చేయడాన్ని బట్టి హంతకులు పగతో రగిలిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జ్యోతికి, యశ్వంత్ కు ఎంత కాలం నుంచి పరిచయం ఉంది, వివాహేతర సంబంధానికి ఎప్పుడు దారి తీసిందనే కోణంలో... పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఉన్న శాస్త్రీయ ఆధారాలతో పాటు... సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. క్లూస్ టీం అధికారులు వచ్చి సంఘటనా స్థలంలోని వేలిముద్రలు సేకరించారు. హంతకులు ఉపయోగించి స్క్రూడ్రైవర్, రాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. మృతురాలి భర్తపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. హత్యలో ఒకరి కంటే ఎక్కువ మందే ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వారాసిగూడ నుంచి కొత్తగూడ వరకు సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వీలైనంత త్వరలో హంతకులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
మా అన్న డ్రైవింగ్ చేస్తాడు. ఆదివారం నా బండి తీసుకపోయిండు. అమ్మాయి కూడా ఎవరో తెల్వదు. చిన్న చిన్న గొడవలు అయితుండే. అవి కూడా కాంప్రమెజ్ అయ్యుండే. మాకు ఎవరి మీద అనుమానం లేదు. - అనిరుధ్, మృతుని సోదరుడు
ఇక్కడ చూస్తే ఇది మర్డర్లాగే కనిపిస్తోంది. వారి పేర్లు యశ్వంత్, జ్యోతి. మహిళ వివాహిత. ఇది ప్రాథమికంగా హత్యలుగా నిర్ధారించాం. ఇద్దరు సికింద్రాబాద్‌కు వారాసిగూడకు చెందినవారు. మాకు ఘటనాస్థలిలో స్కూటర్ దొరికింది. మాకు లభించిన ఆధారాలతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. -సన్‌ప్రీత్‌సింగ్, ఎల్బీనగర్ డీసీపీ
ఇవీ చూడండి: Attack on traffic police: కారు ఆపమన్నందుకు కానిస్టేబుల్‌పై దాడి.. వీడియో వైరల్