హైదరాబాద్‌లోని లోకాయుక్త కాలనీలో ఈ నెల 12న మంజుల అనే మహిళ దారుణ హత్య కేసును సైదాబాద్ పోలీసులు ఛేదించారు. మృతురాలి భర్త పరిమళ్ అగర్వాల్ కోఠిలో మెడికల్ వ్యాపారం చేసేవాడు. ఆయన వ్యాపార్యంలో పెట్టుబడులు పెట్టేందుకు కార్వాన్ టప్పాచబుత్రాకు చెందిన మెహరోజ్ బేగం రూ.11 లక్షలను ఇచ్చింది. లాక్‌డౌన్‌కు ముందు ఆరు నెలల వరకు ప్రతినెలా రూ.20 నుంచి రూ.30 వేల చొప్పున పరిమాళ్ ఆమెకు చెల్లించాడు. కొంతకాలంగా వ్యాపారంలో నష్టాలు వచ్చాయని వారి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు.
ఈ విషయాన్ని మెహరోజ్ బేగం తన కుమారుడు మహమ్మద్ ఇమ్రాన్‌కు చెప్పిడంతో... పరిమళ్ను కలిసి డబ్బులు వసూలు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇమ్రాన్ తన నలుగురు మిత్రులను వెంటబెట్టుకుని లోకాయుక్త కాలనీలో నివాసముండే పరిమళ్ ఇంటికి వెళ్లి అతని గురించి ఆరా తీశాడు. ఆ సమయంలో ఆయన భార్య మంజుల అపార్ట్మెంట్ వద్ద గొడవ వద్దని వారిని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చింది. తన భర్త అదృశ్యమయ్యాడని, తాము విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నామని నమ్మబలికింది.
విడాకుల పత్రాలు చూపించాలని నిందితులు ఆమెను ఒత్తిడి చేశారు. అదే విషయమై వారి మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అదే సమయంలో ఇమ్రాన్ తన వద్ద ఉన్న కత్తితో మంజులపై దాడి చేసి హతమార్చి... అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. పరిమళ్ తండ్రి దినేష్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ప్రత్యేక బృందం దర్యాప్తును చేపట్టింది. నిందితులను అరెస్ట్ చేసి హత్యకు వినియోగించిన కత్తితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, రక్తపు మరకలు ఉన్న షర్ట్స్, ఐదు చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సర్పదోషం ఉందంటూ చిన్నారిని చంపిన కన్న తల్లి