స్థలం పంచాయతీ విషయంలో అవమానభారాన్ని భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ గ్రామ సర్పంచ్‌కు చెందిన పశువుల కొట్టంలో ఉరివేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పొట్టిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
పొట్టిపల్లి గ్రామానికి చెందిన నాగన్నకు(70) చెందిన 9 గుంటల ఇంటి స్థలం విషయంలో ఇటీవల సర్పంచ్ ధనరాజ్ పాటిల్ రచ్చబండ వద్ద పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అందరి ముందు పంచాయితీలో నిలబెట్టి దుర్భాషలాడారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. దీంతో అవమానం తట్టుకోలేక నాగన్న ఉరివేసుకున్నాడని చెబుతున్నారు.
మృతుడి జేబులో ఆత్మహత్యకు ముందు రాసిన లేఖను జహీరాబాద్ గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్సై రవి గౌడ్ పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన తండ్రి ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని బాధితుని కుటుంబసభ్యులు గ్రామంలో ఆందోళనకు దిగారు.
ఇదీ చూడండి: Boy Kidnap in Mattevada :'నీ జ్ఞాపకాలే ఊపిరిగా బతుకుతున్నాం చిన్నా.. త్వరగా తిరిగి రా..!'