Old man fell under a bus: చిన్న చిన్న రోడ్డు ప్రమాదాలకే ప్రాణాలు పోతున్న ఈ రోజుల్లో ఓ వృద్ధుడు బస్సు కింద పడ్డా.. ప్రాణాలతో బయటపడ్డాడు. గమ్యస్థానానికి త్వరగా వెళ్లాలని బయలుదేరిన బస్సు డ్రైవర్ ఓపైపు.. రోడ్డుపై అన్నివైపులా చూసుకోకుండా రోడ్డు దాటేందుకు వృద్ధుడు మరోవైపు ప్రయత్నించడంతో.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు సకాలంలో స్పందించి డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో ఆ వ్యక్తి బస్సు కిందపడ్డా ప్రాణాలతో బయటపడిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని వంతెన వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. చిత్తూరు నుంచి అరగొండ వెళ్లే పల్లె వెలుగు బస్సు.. బస్టాండు నుంచి బయటకు వస్తుండగా.. ట్రాఫిక్ నిలిచిపోవడంతో డ్రైవర్ బస్సును ఆపారు. అదే సమయంలో జీడీ నెల్లూరు మండలం బాలగంగనపల్లికి చెందిన వృద్ధుడు హుస్సేన్ బస్సు ఆగిందని రోడ్డు దాటే ప్రయత్నం చేశారు.
వాహనాలు కదలడంతో వృద్ధుణ్ని గమనించకుండా డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. వాహనం ఢీకొట్టడంతో అక్కడే కిందపడి వాహనం కిందకు వెళ్లిపోయారు. కొద్దిదూరం ఆయనను బస్సు ఈడ్చుకెళ్లింది. వాహనదారులు, స్థానికులు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును నిలిపేశారు. నిర్ఘాంతపోయిన వృద్ధుణ్ని స్థానికులు బయటకు తీశారు. ప్రమాదంలో ఆయన కాలికి గాయం కావటంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఇవీ చదవండి: