కరోనా సోకి చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రి(NIMS)కి వచ్చిన ఓ మహిళా రోగికి వెంటిలేటర్‌తో కూడిన బెడ్ ఇప్పిస్తానంటూ నమ్మపలికి ఓ వ్యక్తి లక్ష రూపాయలు తన బ్యాంక్ అకౌంట్‌లో వెయించుకుని పత్తాలేకుండా పోయాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు లిఖిత పూర్వకంగా తెలిపాడు. విచారణ చేపట్టిన సూపరింటెండెంట్ బాధితుడికి జరిగిన మోసం గురించి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కృష్ణారెడ్డి అనే వ్యక్తి తన తల్లి సుగుణమ్మను ఈ నెల 18న కొవిడ్ చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఆసుపత్రిలో ఓ వ్యక్తి కృష్ణారెడ్డికి తారసపడి తన పేరు ప్రశాంత్‌గా పరిచయం చేసుకున్నాడు. తన తల్లికి కూడా కరోనా సోకడంతో తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్పించానని నమ్మపలికాడు. ఆసుపత్రిలో వెంటిలేటర్ గల బెడ్ కోసం లక్ష రూపాయలు చెల్లించాలని కోరడంతో… గూగుల్ పే ద్వారా చెల్లించడంతో సుగుణమ్మను ఆసుపత్రిలో చేర్పించాడు.
ఇంకా ఆక్సిజన్ కోసం 3 నుంచి 4 లక్షలు వెంటిలేటర్ సదుపాయంతో 7 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు. అనుమానం వచ్చిన కృష్ణారెడ్డి అడ్మిషన్ రిజిస్టర్‌ను పరిశీలించడంతో… కేవలం వెయ్యి రూపాయలే చెల్లించినట్లు ఉంది. మిగతా రశీదులు లేకపోవడం వల్ల మోసపోయానని తెలుసుకుని ఆసుపత్రి సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణకు ఫిర్యాదు చేశానని పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత ఆసుపత్రి సూపరింటెండెంట్ తమకు ఫిర్యాదు చేశాడని పోలీసులు వివరించారు.
ఇదీ చూడండి: 'కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం'