బిడ్డల ఆరోగ్య సమస్య.. మరో వైపు ఆర్థిక ఇబ్బందులు ఆ తల్లి మనసును విరగ్గొట్టాయి. జీవితంపై విరక్తి కలిగేలా చేశాయి. ఆ మనోవేదనలో పేగు బంధాన్ని సైతం మర్చిపోయి.. నవమాసాలు మోసి జన్మనిచ్చిన పిల్లలనే చంపుకుంది. ముక్కుపచ్చలారని ఆ చిన్నారుల ముఖాలు సైతం ఆమెలో జాలిని తీసుకురాలేకపోయాయి. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నానికి ఓడిగట్టింది. ఈ హృదయవిదారక ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
ఉరి వేసి హత్య
సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్‌లో నివాసం ఉండే జ్యోత్స్న.. తన ఇద్దరు చిన్నారులు ఆరేళ్ల రుద్రాంష్, నాలుగు సంవత్సరాల దేవాన్ష్‌ను ఉరి వేసి హత్య చేసింది. అనంతరం సంగారెడ్డి శివారులోని చెరువులో దూకి ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. చెరువులో దూకడాన్ని గమనించిన స్థానిక మత్స్యకారులు జ్యోత్స్నను కాపాడి ఒడ్డుకు చేర్చారు.
సమస్యలతో సతమతమై..
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శివశంకర్, జ్యోత్స్నలకు 2014లో వివాహమైంది. ఇండియన్ బ్యాంకులో క్యాషియర్‌గా విధులు నిర్వర్తించే శివశంకర్‌కు ఏడు నెలల క్రితం సంగారెడ్డికి బదిలీ అయ్యింది. వీరి ఇద్దరు కొడుకులు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దేవాన్ష్‌కు కిడ్నీల సమస్య, రుద్రాంష్కు మల విసర్జన సమస్య ఉంది. వీరికి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నారు. వైద్యానికి పెద్ద ఎత్తున ఖర్చు అవడంతో ఆర్థిక సమస్యలు సైతం తలెత్తాయి. ఓ వైపు పిల్లల అనారోగ్యం.. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు జ్యోత్స్నను మానసికంగా కుంగదీశాయి. దీంతో చిన్నారులను చంపి.. తాను చనిపోవాలన్న నిర్ణయానికి వచ్చింది.
చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం
జ్యోత్స్న తన భర్త శివశంకర్ బ్యాంకుకు వెళ్లిన తర్వాత.. ఇంట్లో ఇద్దరు పిల్లలకు చున్నీతో ఉరి వేసి హత్య చేసింది. అనంతరం ఆమె సంగారెడ్డి శివారులోని మహబూబ్ సాగర్ చెరువు వద్దకు చేరుకుంది. తాను ఆత్మహత్య చేసుకుంటునట్లు భర్తకు వాట్సాప్‌కు చెరువు ఫోటోలు పంపి అందులో దూకింది. శివశంకర్ తన సహచరులతో వెంటనే చెరువు వద్దకు చేరుకున్నారు. అప్పటికే మత్స్యకారులు జ్యోత్స్నను బయటకు తీసి రక్షించారు. అనంతరం భార్యభర్తలు ఇంటికి చేరుకునే సరికి పిల్లలు విగతజీవులుగా కనిపించారు. భర్త విషయం అడగగా.. తానే హత్య చేశానని.. తాను కూడా మందు గోళీలు మింగానని చెప్పింది. హుటాహుటిన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చిన్నారులు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. జ్యోత్స్నకు చికిత్స అందిస్తున్నారు.
కంటికి రెప్పాల కాపాడుకోవాల్సిన తల్లే తన పిల్లలను చంపుకోవడం.. సంగారెడ్డి పట్టణంలో సంచలనం రేపింది.
ఇదీ చదవండి: Crime: సంగారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం