జనగామ జిల్లాలో చైన్ స్నాచింగ్‌కు వచ్చి పాపను నీటిసంపులో పడేసి చంపిన ఘటన కొత్త మలుపు తిరిగింది. ప్రసన్న అనే మహిళ మెడలో నుంచి మంగళసూత్రం దొంగిలించడానికి ఎవరూ రాలేదని.. తల్లే పాపను హత్య చేసి కట్టుకథ అల్లిందని పోలీసులు తేల్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు డీసీపీ సీతారాం వెల్లడించారు. జనగామ పట్టణమం అంబేడ్కర్ నగర్‌కు చెందిన నడిగోటు ప్రసన్న-భాస్కర్ దంపతులకు చనిపోయిన చిన్నారితో పాటు.. మూడేళ్ల కుమారుడు ఉన్నారని డీసీపీ సీతారాం తెలిపారు. బాబుకు గుండె సంబంధిత జబ్బు రావడంతో కొన్ని రోజుల క్రితమే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారని చెప్పారు. పాప తేజస్వినిలోనూ ఎదుగుదల లేక జీవితాంతం మాటలు రావని వైద్యులు తెలపడంతో తల్లి ప్రసన్న మానసింకంగా కుంగిపోయిందన్నారు.
ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లి తేజస్వినిని నీటి సంపులో వేసి హతమార్చిందని తెలియజేశారు. అనంతరం కావాలనే గొలుసు దొంగ చంపాడని కేసును తప్పుదోవ పట్టించిందని అన్నారు. విచారణలో భాగంగా తల్లి చేసిన తప్పును ఒప్పుకుందని.. నిందితురాలిపై శిశు హత్య 302 కేసు నమోదు చేశామని డీసీపీ సీతారాం పేర్కొన్నారు.
"నిందితురాలికి చనిపోయిన చిన్నారితో పాటు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇద్దరు చిన్నారులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. చనిపోయిన తేజస్విని పుట్టిన నాటి నుంచి ఎలాంటి ఎదుగుదల లేదు. దీంతో బంధువులు, స్థానికులు హేళనగా మాట్లాడటం వల్ల దంపతులు మానసికంగా కుంగిపోయారు. పాప వల్ల ఇబ్బందులు తప్పవని తల్లి నీటిసంపులో పడేసి హత్య చేసింది. నేరాన్ని చేసినట్టు పోలీసుల ఎదుట ఆమె అంగీకరించింది" -సీతారాం డీసీపీ
ఇవీ చదవండి: చైన్‌స్నాచింగ్‌ను ప్రతిఘటించిన మహిళ.. పాపను లాక్కొని నీటిసంపులో పడేసి..