సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో తల్లీకూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. భూతగాదా, పొలంలో వ్యవసాయబావి నీళ్ల కోసం తలెత్తిన గొడవలో నిండు ప్రాణాలు బలయ్యాయి. మడద గ్రామానికి చెందిన గుగ్గిల్లపు సారవ్వ(60), ఉసికే నిర్మల(30) అత్యంత దారుణంగా హత్య చేయబడ్డారు. హుస్నాబాద్ శివారులోని మడద గ్రామానికి వెళ్లే రహదారిలోని పొలం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లీ కూతుళ్ళ దారుణ హత్యతో మడద గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇద్దరు మహిళలను మెడపై గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసులు గుర్తించారు. భూ తగాదాలు, వ్యవసాయ భూమిలో ఉన్న బావి నీళ్ల విషయంలో గొడవలు జరిగి సొంత పిన్ని, చెల్లిని పెద్దనాన్న కుమారుడు గుగ్గిళ్ల శ్రీనివాస్ హత్య చేసినట్లు మృతురాలు నిర్మల భర్త ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏఎస్పీ మహేందర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రాథమికంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.