Kodangal Boy Missing Case: కొడంగల్ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. నిన్న ఉదయం కనిపించకుండా పోయిన బాలుడు రాత్రికి శవమై కనిపించాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడంగల్ పట్టణంలో అఫ్రోజ్ ఖాన్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అతని రజాఖాన్(10) ఆదివారం ఉదయం సైకిల్ తొక్కుకుంటూ వీధిలో ఉల్లాసంగా తిరిగాడు.
అయితే సైకిల్ తొక్కుకుంటూ బయటకు వెళ్లిన బాలుడు సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాలేదు. కనిపించకుండా పోయిన రజాఖాన్ కోసం తల్లిదండ్రులు వెతికారు. చుట్టు పక్కల ఇళ్లలో, స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఆచూకీ కోసం చూశారు. కానీ ఎక్కడా కనిపించలేదు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొడంగల్ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు.
పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న అనుమానితున్ని ఆదివారం సాయంత్రం విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. అర్ధరాత్రి తర్వాత రజాఖాన్ మృతదేహం ఉన్న చోటుకి పోలీసులకు తీసుకువెళ్లాడు. కొడంగల్‌లోని వసతిగృహం ముందు ముళ్లపొదల్లో బాలుడు మృతిదేహం పోలీసులకు లభించింది. అయితే అనుమానిత వ్యక్తే బాలుడిని హతమార్చాడా లేదా ఎవరైనా చంపారా అన్న విషయం గురించి తెలియాల్సి ఉంది.
తమ కుమారుడు కిడ్నాప్ అయ్యాడని తెలుసుకున్న తల్లిదండ్రులు.. తమ కొడుకుని క్షేమంగా అప్పగిస్తే వారికి రూ.5 లక్షల నగదు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. చివరకు తాము అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడిని ఎవరో చంపేశారని తెలుసుకుని గుండెలవిసేలా రోదించారు. చిన్నారి మృతితో వికారాబాద్ కొడంగల్‌లో పాఠశాలలు, వ్యాపార సంస్థలు బంద్ పాటించాయి. బాలుడి మృతికి నిరసనగా పలు సంస్థలు బంద్ ప్రకటించాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.