suicide attempt : తన అవసరాలకు తల్లి డబ్బులు ఇవ్వడంలేదనే కోపంతో కుమారుడు ఆదివారం రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. గుర్తుతెలియని ద్రావణం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతణ్ని పరిశీలించిన 108 సిబ్బంది పల్స్ అందడం లేదని, మరణించి ఉండొచ్చని నిర్ధారించి వెనుతిరిగారు. అనుమానంతో స్థానికులు నీళ్లు చల్లగా బాధితుడు లేచాడు.
వెంగళరావునగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్(45) షేర్ల ట్రేడింగ్ చేస్తుండేవాడు. భార్య పిల్లలున్నారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో డబ్బు కావాలని తల్లి లక్ష్మితో తరచూ గొడవపడుతుండేవాడు. తండ్రి లక్ష్మీనారాయణ ఏడాది కిందట మరణించారు. వారు ఉంటున్న ఇంటిని అమ్మమని తల్లితో ఘర్షణ పడుతుండేవాడు. తాను చనిపోతానని బెదిరించి ఆదివారం ఇంటిపైకి ఎక్కాడు. తల్లి 100కు డయల్ చేయగా పోలీసులు వచ్చి శ్రీనివాస్‌కు నచ్చజెప్పి కిందకు దించారు.
పోలీసులు వెళ్లాక మళ్లీ ద్రావణం తాగి అపస్మారక స్థితికి చేరాడు. 108 సిబ్బందికి సమాచారమివ్వగా.. పరీక్షించి పల్స్ అందడం లేదని వెనుదిరిగారు. అప్రమత్తమైన స్థానికులు చివరి ప్రయత్నంగా అతడి ముఖంపై నీళ్లు చల్లగా శ్రీనివాస్ లేచాడు. వెంటనే అతణ్ని కుటుంబ సభ్యులు స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
ఇవీ చదవండి: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు