ప్రమాదవశాత్తు భవనంపై నుండి పడి అమ్ములు అనే మహిళ మృతి చెందిన ఘటన సికింద్రాబాద్‌లోని అల్వాల్‌లో జరిగింది. భూదేవి నగర్‌లో నివాసం ఉంటున్న అమ్ములు భవనంపైకి ఎక్కుతున్న క్రమంలో... మెట్ల వద్ద కాలుజారి కింద పడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించింది.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె చనిపోయిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదవశాత్తు మరణించిందా... లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అమ్ములు మరణంతో భూదేవి నగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇదీ చదవండి: Murder: విద్యార్థినిని గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది