Married Woman Suicide: సినిమాకు వెళ్లే విషయంలో దంపతుల మధ్య తలెత్తిన వివాదం గృహిణి బలవన్మరణానికి దారితీసింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సంతోశ్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెం గ్రామానికి చెందిన రాజు(22), స్వాతి(20) ప్రేమించుకున్నారు. ఫిబ్రవరిలో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. తరువాత ఇరువైపులా ఒప్పించారు. రెండు నెలల కిందట శంకర్‌పల్లి పట్టణంలోని భవానీనగర్‌లో అద్దె గది తీసుకుని కాపురముంటున్నారు. రాజు హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం రాత్రి సెకండ్ షో సినిమాకి తీసుకెళ్లాలని భార్య కోరగా రాజు నిరాకరించాడు. గురువారం తీసుకెళ్తానని చెప్పాడు.
ఈ విషయంలో చిన్నపాటి గొడవ జరగ్గా.. మనస్తాపానికి గురైన స్వాతి గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. సమాచారం అందుకుని వచ్చిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.
ఇదీ చదవండి:Two Groups attack: దంపతుల పంచాయితీ.. ప్రాణాలు తీసిన ఇరువర్గాల ఘర్షణ