ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కార్పొరేటర్ హత్య కలకలం రేపింది. కాకినాడ 9వ డివిజన్ కార్పొరేటర్ కంపర రమేష్‌ను అర్ధరాత్రి కారుతో ఢీకొట్టి చంపేశారు. పాతకక్షలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం... కార్ల మెకానిక్ షెడ్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి కార్పొరేటర్ రమేష్, అతని స్నేహితులు సతీష్, వాసులతో కలిసి మద్యం సేవించారు. అదే సమయంలో చిన్నా అనే వ్యక్తికి రమేష్ ఫోన్ చేయడంతో ఆయన తన తమ్ముడితో కలిసి అక్కడికి వచ్చారు. తన తమ్ముడి పుట్టిన రోజని, కేక్ కటింగ్‌కు రావాలని చిన్నా ఆహ్వానించగా .. రమేష్ తిరస్కరించారు.
అంతా ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో కారు తాళాల విషయంలో చిన్నా, రమేష్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో చిన్నా కారుతో ఢీకొట్టి రమేష్‌ను హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు సీఐ తెలిపారు. పాతకక్షలే హత్యకు కారణమని భావిస్తున్నట్టు వివరించారు. కార్పొరేటర్‌ను హత్య చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
ఇదీ చదవండి: పసిబిడ్డను చంపిన తల్లిదండ్రులకు యావజ్జీవం