హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నాగోల్-అలకపురి వద్ద ఫుట్‌పాత్‌లపై కొందరు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. రోడ్డు ఆక్రమణలకు గురిచేస్తున్న ప్రదేశాలను ఖాళీ చేయించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. స్థానిక కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టగా... దుకాణదారులు వారిని అడ్డుకున్నారు.
ఎటువంటి సమాచారం ఇవ్వకుండా... కావాలనే తమ షెడ్లు కూల్చివేస్తున్నారంటూ దుకాణదారులు ఆరోపించారు. రాధా ధీరజ్ రెడ్డి తన అనుచరులతో వచ్చి... బూతులు తిట్టి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ఆక్రమణలను అడ్డుకుని... పాదచారులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటుంటే దుకాణదారులు అడ్డుపడుతున్నారని కార్పొరేటర్ రాధ పేర్కొన్నారు.
ఈ ఘటన వెనుక ఎటువంటి దురుద్దేశం లేదని... కావాలనే మత పరంగా తీసుకెళ్తున్నారని రాధ స్పష్టం చేశారు. సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసి పరిస్థితిని చక్కదిద్దారు.
ఇదీ చూడండి: మొన్న భర్త.. నేడు భార్య.. అనాథలైన చిన్నారులు