ఎన్నో మాటలు చెప్పాడు. నీకు నేనున్నాను అన్నాడు. నువ్వుంటే.. రాజభోగాలు కూడా అవసరంలేదన్నాడు. నరకంలోనూ నీకోసం స్వర్గం సృష్టిస్తా అన్నాడు. మహారాణిలో గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానన్నాడు. నీ కంట్లో కన్నీటి చుక్క రాకుండా కాచుకుంటానన్నాడు. అతడితో ఉంటే చాలు.. తన జీవితం సుఖంగా ఉంటుందని ఆ అమ్మాయి నమ్మేలా చేశాడు. తీరా ప్రేమ, పెళ్లి అయ్యాక.. అతడి అసలు రూపం బయటపెట్టాడు. తన కమర్షియల్ కోణాన్ని బయటకు తీసి.. వేధించటం ప్రారంభించాడు. చివరికి.. చంపేందుకు కూడా సిద్ధపడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగింది.
ప్రేమ నుంచి పెళ్లికి..
జూబ్లీహిల్స్ వెంకటగిరికి చెందిన రవి నాయక్‌కు ముంబయికి చెందిన హసి అనే అమ్మాయి ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా.. నెమ్మదిగా ప్రేమైంది. రోజురోజుకూ వాళ్ల ప్రేమ గాఢంగా మారి.. పెళ్లి వరకు తీసుకొచ్చింది. అన్ని కుదిరి.. ఈ మధ్యే వీళ్లిద్దరు వివాహం కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత అమ్మాయిని హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. తనకు ఇంతకుమునుపే తెలిసిన బ్యూటీషియన్ పనిని హసి చేస్తూ.. ఇంటిని నెట్టుకొస్తుంది. రవినాయక్ మాత్రం ఎలాంటి పని చేయకుండా ఖాళీగానే ఉంటున్నాడు.
పెళ్లయ్యాక కొన్ని రోజులకు..
కొన్ని రోజుల పాటు అంతాబాగానే సాగింది. ప్రేమించుకున్న సమయంలో డబ్బుతో పనిలేకపోయేసరికి.. ఇద్దరు ఉచితంగా ఎన్నో మాటలు చెప్పుకున్నారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నామని ఒకరితో ఒకరు పోటీపడ్డారు. తీరా పెళ్లై.. బాధ్యతలు మీద పడగానే.. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఇద్దరి మధ్య మెల్లగా గొడవలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక ఇదే సమయంలో రవి తన అసలు క్యారెక్టర్‌ను బయటకు తీశాడు. తనలో కమర్షియల్ ఆలోచనలతో.. అదనపు కట్నం తీసుకురావాలంటూ రవి.. హసీని వేధించసాగాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి హసి.. ఎంత బాధపెట్టినా కడుపులోనే దాచుకుంది. రవి పైశాచికత్వం రోజురోజు పెరుగుతూ వచ్చింది.
వేలు కట్ చేసి మరీ..
ఈ నెల 10 తనకు రూ. 50 వేలు కావాలంటూ రవి భార్యను అడిగాడు. లేవని హసి.. తెగేసి చెప్పటంతో తీవ్రంగా కొట్టాడు. అక్కడితో ఆగకుండా.. కత్తితో ఓ వేలిని కట్ చేసి పారిపోయాడు. తెల్లారి మళ్లీ హసికి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఇక రవి వేధింపులు భరించలేక.. హసి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు రవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: