ముంబయికి చెందిన నగల వ్యాపారి శ్రవణ్ కుమార్ (రనూజ జువెలర్స్ యజమాని) హైదరాబాద్‌తో పాటు.. దేశంలోని పలు నగరాలకు బంగారు ఆభరణాలను సరఫరా చేస్తుంటాడు. శ్రవణ్ కింద ఉద్యోగులుగా పనిచేసే ముకేశ్, గులాబ్ మాలి ఇద్దరూ ఆగస్టు 23న 3 కిలోల 336 గ్రాముల బంగారు ఆభరణాలను హైదరాబాద్‌లోని పలు దుకాణాలకు డెలివరీ ఇచ్చేందుకు ముంబయి నుంచి బస్సులో బయలుదేరారు.
పక్కా పథకంతో..
గోల్డ్ ట్రేడింగ్, విలాసాలకు అలవాటు పడిన గులాబ్ మాలి అనే ఉద్యోగి.. ఈ సరుకుపై కన్నేశాడు. ఇదే అనువైన సమయంగా భావించి.. తన స్నేహితుడు ప్రవీణ్ కుమార్‌తో కలిసి పథకం రచించాడు. అనుకున్నదాని ప్రకారం తన స్నేహితుడు ప్రవీణ్ కుమార్‌ను ముంబయిలో బస్సెక్కించాడు. 2 కిలోలకుపైగా బంగారం ఉన్న ప్యాకెట్‌ను ఇచ్చి పూణెలో దించేశాడు. హైదరాబాద్‌లోని అమీర్‌పేటకు చేరుకున్న తర్వాత తాను నిద్రలో ఉన్నప్పుడు బంగారం చోరీకి గురైందని యజమానిని, ముకేశ్‌తో కలిసి నమ్మించాడు. ఇద్దరూ కలిసి సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు.. కేసును పంజాగుట్ట పీఎస్‌కు బదిలీచేశారు.
ముంబయి టూ రాజస్థాన్ వయా పూణె...
పంజాగుట్ట ఏసీపీ గణేష్.. ఇద్దరినీ తనదైన శైలిలో విచారించగా.. వారిలో చోరీకి పాల్పడ్డ గులాబ్ మాలి తన తప్పును ఒప్పుకున్నాడు. తన స్నేహితుడు ప్రవీణ్ కుమార్‌తో కలిసి ఈ చోరీకి పాల్పడ్డట్లు, చోరీకి గురైన బంగారం రాజస్థాన్‌లోని ప్రవీణ్ అతని ఇంట్లో దాచిపెట్టినట్లు సమాచారం అందించాడు. రాజస్థాన్‌లోని ప్రవీణ్ ఇంటికి వెళ్లి చోరీకి గురైన 2052.980 గ్రాముల బంగారాన్ని పోలీసులు రికవరీ చేసుకున్నారు. మిగిలిన 69.150 గ్రాముల బంగారాన్ని నిందితుడు ప్రవీణ్ తన ఐసీఐసీఐ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నాడని.. తక్కిన మొత్తం విలాసాలకు ఖర్చు చేశారని పోలీసులు నిగ్గుతేల్చారు.
పదేళ్లుగా యజమాని శ్రవణ్ కుమార్ దగ్గర నమ్మకంగా పనిచేసిన ఉద్యోగి గులాబ్ మాలీనే ఈ చోరీకి పథక రచన చేశాడని.. వ్యసనాలకు బానిసై ఈ దురాగతానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్టు తెలిపారు.
ఇదీ చూడండి: