sadistic holi celebrations: పండుగ పేరు చెప్పుకుని తమలోని క్రూరత్వాన్ని ప్రదర్శించి పైశాచికానందం పొందటం ఇప్పుడు చాలా మందికి అలవాటైపోయింది. హోలీ అంటే రంగులు పూసుకుని శుభాకాంక్షలు తెలపటం ఆనవాయితీ. దానికి తోడు టమాటాలు, గుడ్లు కొట్టటాన్ని ప్రారంభించారు. అక్కడితో ఆగారా అంటే.. నలుగురు చేరి ఒక్కన్ని అమాంతం మురికి కాలువల్లో పడేయటం.. పేడ నీళ్లు ముఖాన కొట్టటం.. బురదలో బొర్లించటం.. ఇలా వాళ్లలో ఉన్న శాడిజానికి పనిచెబుతున్నారు. ఇప్పుడు అలా చేస్తేనే ఎంజాయ్మెంట్ అనే స్థాయికి దిగజారిపోయారు యువత. అలాంటి వాళ్లనే ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు ఈ పిల్లలు.. వాళ్లు ఓ అడుగు ముందుకేసి స్నేహితునికి ఏకంగా బ్లేడ్‌తో గాట్లు పెట్టి సైకోయిజాన్ని ప్రదర్శించారు.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వెనకాల ఉండే ఇందిరానగర్‌లో 9వ తరగతి చదువుతున్న శ్రీహరి అనే విద్యార్థి నివాసముంటున్నాడు. హోలీ సందర్భంగా శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంటి ముందు శ్రీహరి హోలీ ఆడుకుంటున్నాడు. శ్రీహరి ఇంటికి సమీపంలోనే నివసించే అభి, నాని, బబ్లూ అనే ముగ్గురు స్నేహితులు వచ్చి ఒంటి నిండా రంగులు పూశారు. ఆ తర్వాత తలపై కోడిగుడ్లు కూడా కొట్టారు. అప్పటికీ వదిలిపెట్టకపోవటంతో.. వాళ్ల నుంచి విడిపించుకునేందుకు శ్రీహరి ప్రయత్నించాడు. అప్పుడే.. ముగ్గురు స్నేహితులు వాళ్లతో తెచ్చుకున్న బ్లేడ్ తీసి.. శ్రీహరి వీపు, తొడలపై గాట్లు పెట్టారు. రక్తస్రావం జరగడం, నొప్పితో బాధితుడు కేకలు వేయడంతో గమనించిన శ్రీహరి తల్లి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. అనంతరం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీ చూడండి: