Fake Whats app profile Fraud: దిల్లీ హైకోర్టు ప్రస్తుత సీజే, తెలంగాణ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. జస్టిస్ సతీశ్ చంద్ర ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి.. డబ్బులు కావాలంటూ తెలంగాణ హైకోర్టులో పని చేస్తున్న ఓ అధికారి నుంచి రెండు లక్షలు దోచేశారు సైబర్ కేటుగాళ్లు.
Fake Whats app Fraud with Delhi CJ: తెలంగాణ హైకోర్టు సీజేగా పనిచేసిన సతీశ్ చంద్ర కొంతకాలం కిందట దిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి.. తెలంగాణ హైకోర్టులో సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న శ్రీమన్నారాయణ అనే అధికారికి సీజేనే మెసేజ్ చేసినట్లు సందేశం పంపారు.
"నేనిప్పుడు ఓ ప్రత్యేక సమావేశంలో ఉన్నాను. అత్యవసరంగా నాకు డబ్బు అవసరముంది. కానీ నా బ్యాంక్ కార్డులన్నీ బ్లాక్ అయ్యాయి. మీకో అమెజాన్ లింక్ పంపిస్తాను. దాన్ని క్లిక్ చేసి రూ.2లక్షలు విలువ చేసే గిఫ్ట్ కార్డులు పంపించాలి" అని సైబర్ నేరగాళ్లు.. సీజే జస్టిస్ సతీశ్ చంద్ర మెసేజ్ చేసినట్లుగా సదరు సబ్‌రిజిస్ట్రార్‌కు పంపారు.
తనకు సందేశం పంపింది సీజే అని భావించిన శ్రీమన్నారాయణ సైబర్ నేరస్థులు చెప్పిన విధంగా చేసి డబ్బు కోల్పోయారు. ఆ తర్వాత సీజే నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ నంబర్‌కు కాల్ చేయగా.. స్విచ్ఛాఫ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఉన్నత స్థాయి పదవిలో ఉన్నవారెవరూ డబ్బు అడగరని.. అలా అడిగినప్పుడు అది సైబర్ నేరగాళ్ల పనేనని గుర్తించాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా అమెజాన్ గిఫ్ట్ అని చెబితే వెంటనే అది సైబర్ నేరస్థులు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకోవాలని చెప్పారు.