నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని సబ్ జైల్ ముందు ఉన్న విజయకృష్ణ జనరల్ ఆస్పత్రి ఫిజీషియన్ వారం రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విజయకృష్ణ ఆస్పత్రిలో పనిచేసే దయానంద్(FAKE DOCTORS) ఆన్‌లైన్‌లోనూ కొవిడ్ చికిత్స చేసే స్థాయికి ఎదిగారు. మెడికల్ షాప్ యజమానితో కుమ్మక్కై అవసరం లేకున్నా రకరకాల మందులు రాస్తూ అమాయకుల నుంచి దోచుకున్నారు. ఈయనతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఎండీలుగా బోర్డులు చూపుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు వెలుగు చూశాయి. దేవరకొండ నియోజకవర్గ కేంద్రంగా ఏళ్ల తరబడి నకిలీ డిగ్రీలతో(fake degrees) వైద్యం చేసిన పలువురి బాగోతం బయటపడింది.
అజ్ఞాతంలోకి..
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్థానిక బ్రాంచి పలు అనుమానాలతో కొందరు వైద్యుల విద్యార్హతపై తీగలాగితే డొంక కదిలింది. ఐఎంఏలో(IMA) సభ్యత్వం ఇచ్చేందుకు పట్టణంలోని పలువురు వైద్యులకు తాము చదువుకున్న ఎంబీబీఎస్(MBBS), ఎండీ(MD) ఇతర పట్టాలను సమర్పించాలని గురువారం నోటీసులు జారీ చేశారు. ఎక్కువమంది వైద్యులు తమ ధ్రువపత్రాలను అందజేశారు. కాగా ప్రముఖ వైద్యుడిగా చెలామణి అవుతున్న దయానంద్ ఎలాంటి పత్రాలు అందించకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. కనీసం చరవాణి సమాచారం కూడా అందుబాటులో లేకుండా వెళ్లారు.
గతంలోనూ వైద్యాధికారుల ఆగ్రహం
ఈయనతోపాటు మరో వైద్యుడు ఎంబీబీఎస్ పట్టా ఉన్నప్పటికీ ఎండీగా చెలామణి అవుతూ వైద్యం చేస్తున్నారు. ఇదిలా ఉండగా 2020లో ఆస్పత్రిపై జిల్లా వైద్యాధికారి కొండల్ రావు సిబ్బందితో తనిఖీలు నిర్వహించినప్పుడు ప్రిస్క్రిప్షన్‌పై ఉన్న వైద్యుడు కాకుండా మరో వైద్యుడు చికిత్సలు నిర్వహిస్తుండటంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించి వెళ్లారు. అదనపు అర్హతలను చూపిస్తున్నారని ఇదే ఆస్పత్రిపై మరోమారు ఫిర్యాదు వచ్చింది. మరో ఇద్దరు వైద్యులపై ఆరోపణలు రావడంతో వారు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.
ఒళ్లు, ఇళ్లు గుల్ల
దేవరకొండలో నియోజకవర్గంలో మొత్తం నలుగురు నకిలీ వైద్యులు ఏళ్ల తరబడి చెలమాణి కావడం గమనార్హం. అర్హత లేకున్నా జనం నాడి పట్టి... జనరల్ ఫిజీషియన్ అవతారమెత్తారు. డిగ్రీలు లేకున్నా వైద్యం చేస్తూ జనం ఒళ్లు, ఇళ్లు గుల్ల చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఇదీ చదవండి: డోలీ కట్టి గర్భిణీ తరలింపు.. పుట్టిన కాసేపటికే మగబిడ్డ మృతి