ఆదివాసీ మహిళల పట్ల అత్యంత అమానుషంగా అటవిశాఖ సిబ్బంది వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. అటవీ ఉత్పత్తుల కోసం అడవికి వెళ్లిన గిరిజన మహిళలపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. వృద్ధులు, మహిళలన్న కనికరం లేకుండా అర్ధరాత్రి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఈ అమానవీయ సంఘటనకు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చెంచుపలుగు తండా, గుంపన్పల్లి గ్రామాలకు చెందిన గిరిజన మహిళలు సాక్ష్యంగా నిలిచారు. ఈ దాడిలో నలుగురి పరిస్థితి విషమించగా, 11 మంది స్వల్ప గాయాలతో మన్ననూర్ బేస్ క్యాంప్ వద్దకు చేరుకున్నామని బాధితులు తెలిపారు.
అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవన సాగించే ఆదివాసీలపై అటవీశాఖ సిబ్బంది దారుణంగా వ్యవహరించారు. అర్ధరాత్రి అడవిలో నిద్రిస్తున్న వారి పట్ల అత్యంత అటవీకంగా ప్రవర్తించారు.
దాడికి నిరసనగా ప్రజాసంఘాల రాస్తారోకో:
గిరిజన మహిళలపై అటవీశాఖ అధికారుల దాడిని నిరసిస్తూ శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై మున్ననూర్ చెక్ పోస్ట్ వద్ద ప్రజాసంఘాలతో కలిసి గిరిజన నాయకులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ వరకు వందలాది వాహనాలు నిలిచిపోయాయి..
విచారణ చేసి చర్యలు తీసుకుంటాం: అధికారులు
ఘటనకు కారకులైన వారిపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని దోమలపెంట అటవీశాఖ రేంజర్ తెలిపారు. బాధితులకు సత్వరమే వైద్య సేవలు అందించాలని డీఎస్పీ, ఆర్టీవో వైద్య సిబ్బందిని ఆదేశించారు.
గిరిజనుల ఆగ్రహం
ఈ దాడిపై ఆగ్రహానికి గురైన ఆదివాసీలు మన్ననూర్ బేస్ క్యాంపు వద్దకు చేరుకుని అటవీ సిబ్బందిపై దాడులు చేశారు. దీంతో అటవీశాఖ సిబ్బంది పరుగులు తీశారు. ఈ ఘటనలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రామాంజనేయులు, ఇతర వాచర్లకు స్వల్ప గాయాలయ్యాయి. అక్కడే ఉన్న అటవీశాఖ అధికారుల వాహనం అద్దాలు గిరిజనులు ధ్వంసం చేశారు.