Fire Accident Gymkhana Ground Vijayawada: విజయవాడ గాంధీనగర్ జింఖానా మైదానంలోని బాణసంచా దుకాణంలో అగ్నిప్రమాదం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దీపావళి వేళ దుకాణాలు ఏర్పాటు చేసి.. టపాసులు సమకూర్చుకొనే పనిలో దుకాణదారులు ఉన్నారు. ఇంతలో ఓ దుకాణం వద్ద టపాసులు దించుతుండగా ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో చుట్టుపక్కల ఉన్నవారంతా పారిపోగా.. దుకాణంలో ఉన్న బ్రహ్మ, కాశీ అనే ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మృతిచెందారు.
ఈ ప్రమాదంలో 15, 16, 17వ నంబర్ దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. 18వ నంబర్ దుకాణం పాక్షికంగా దగ్ధమైంది. పేలుడు ధాటికి స్థానికులు భయాందోళన చెందారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన పోలీసులు, అగ్నిమాపక అధికారులు.. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఏ మాత్రం ఆలస్యమైనా మైదానంలోని 20 షాపులు దగ్ధమయ్యేవని స్థానికులు తెలిపారు.
అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, విజయవాడ నగర కమిషనర్ పరిశీలించారు. ప్రమాదవశాత్తు చిచ్చుబుడ్లు పేలి ప్రమాదం జరిగినట్లు సీపీ తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామన్నారు. పెట్రోల్ బంక్ పక్కన బాణసంచా దుకాణాలకు ఎలా అనుమతించారని స్థానికుల ప్రశ్నిస్తున్నారు. ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు.. మునుగోడుకి తరలిస్తుండగా భారీగా పట్టుబడిన నగదు
కాలువలో పడి ఐదుగురు బాలికలు మృతి.. మట్టి కోసం వెళ్లగా ప్రమాదం