Farmer suicide: అప్పుల బాధతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం రామ్ లాల్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన రమావత్ శ్రీను(35)కు.. రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులోనే సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కాలం కలిసొస్తుందనే ఆశతో.. ఈ ఏడాది మరో రెండెకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. 2 ఎకరాల్లో మిర్చి, ఒక ఎకరంలో వరి, మరో ఎకరంలో ఇతర పంటలను వేశారు. సుమారు 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఈ క్రమంలో తామర పురుగు, అకాల వర్షంతో మిర్చి పంట దెబ్బ తిని.. కేవలం రెండు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది.
అప్పు తీరే మార్గం లేక
ఆ పంటను అమ్మగా వచ్చిన నగదుతో.. అప్పు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో రైతు శ్రీను మనస్తాపానికి గురయ్యారు. అప్పు తీరే మార్గం లేక శనివారం.. పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిని గమనించిన సమీప రైతులు.. శ్రీనును మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రైతు.. అదే రోజు రాత్రి మృతి చెందారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కు మరణంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.
ఇదీ చదవండి: సాగర్ భూములపై ప్రజాప్రతినిధుల కన్ను.. ఆక్రమణలపై ఉక్కుపాదం