Farmer Commits Suicide In Karimnagar: వ్యవసాయం చేస్తే.. అన్నిసార్లు కలిసి రావాలని లేదు. ప్రకృతి పగబట్టినా.. నాసిరకం విత్తనాలు, పండించిన పంటకు తగ్గిన గిట్టుబాటు ధర రాకపోయినా నష్టాలు తప్పవు. ఈ మూడింటిలో ఏది జరిగినా రైతు పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇలాంటి పరిస్థితుల వల్లే ఈ ఏడాది రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. నిరుడు కాకపోయినా ఈ ఏడాదైనా సాగు కళకళలాడి అప్పులు తీరుతాయన్న ఆ అన్నదాత ఆశలు మరోసారి ఆవిరయ్యాయి. పెరుగుతున్న అప్పుల భారాన్ని మోయలేక కరీంనగర్ జిల్లాలో గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు ప్రాణాలను తీసుకున్నాడు.
కొండాపూర్ గ్రామంలో సుధగోని రాజయ్య(50) అనే రైతుకు సొంతంగా నాలుగు ఎకరాల వ్యవసాయం భూమి ఉంది. అందులో వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు. రాజయ్య ఆ నాలుగు ఎకరాలతో పాటు ఇంకో 5 ఎకరాల భూమిని ఐదేళ్లుగా కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నాడు. రాజయ్య వ్యవసాయంతో పాటు ఆదనపు ఆదాయం వస్తుందని భావించి పట్టుపురుగుల పెంపకాన్ని కూడా చేసేవాడు. మొదటలో మంచి లాభాలు వచ్చిన తరవాత నష్టాలు మిగిలాయి.
ఎండ, వానలకు ఓర్చి ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు.. కొన్ని సంవత్సరాలు నుంచి ఆదాయం రాక వ్యవసాయంలో నష్టం వాటిల్లడంతో.. అప్పులు చేసి మరీ పంటను పండించేవాడు. అయినా పెట్టిన పెట్టుబడికి లాభాలు రాకపోవడంతో ఆర్థికంగా కుదేలయ్యాడు. ఆఖరికి ఆ అప్పులను తీర్చడానికి తన దగ్గర ఉన్న నాలుగు ఎకరాల భూమిలో.. రెండు ఎకరాలు అమ్మాడు. అయినా సరే ఇంకా నష్టాల ఊబిలోనుంచి బయటకు రాలేకపోయాడు.
ఇంకా అతనికి రూ.10లక్షలు అప్పు ఉంది. వ్యవసాయంలో లాభాలు రాకపోవడంతో.. అనేక ఇబ్బందులు తలెత్తి పెట్టుబడులు పెట్టలేక ఈ ఏట కౌలు చేస్తున్న భూమిని సైతం వదులుకున్నాడు. ఈ బాధను భరించలేక మనస్తాపానికి గురై.. అతడు తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని.. కన్నీరు మున్నీరయ్యారు. రాజయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పిల్లలు ముగ్గురికీ రాజయ్య వివాహం చేశాడు.
రైతులు పంటలు నష్టపోతే ప్రభుత్వాలు కనీస మద్దతు ధరను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను ప్రకటించాలని చూస్తుంది. దీనివల్ల రైతన్నల ఆత్మహత్యలు తగ్గుతాయని ప్రభుత్వం యోచిస్తుంది.
ఇవీ చదవండి: