రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్ల ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఈ ఏడాదిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు జగిత్యాల, వరంగల్‌లో పలు ముఠాలను పోలీసులు పట్టుకొని భారీగా నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. చదువు మధ్యలో మానేసిన వారితో పాటు.. ఉన్నత విద్యావంతులు ఆ ధ్రువపత్రాలు తయారు చేసే వారిలో ఉంటున్నారు. సైబరాబాద్ పోలీసులకు గత నెల పట్టుబడిన ముఠా వెనుక.. మేఘాలయాలోని ఓ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఉన్నట్టు బయటపడింది.
పది నెలల క్రితం దొరికిన మరో ముఠాతో.. భోపాల్‌లోని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. తాజాగా అంతర్రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్ల ముఠా రహస్యాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఆ ముఠా 13 విశ్వవిద్యాలయాలకు చెందిన 140 నకిలీ పట్టాలు తయారు చేసినట్టు గుర్తించారు. ఒక్కో సర్టిఫికెట్‌కు 50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో నెలకు ఒకటి రెండు నకిలీ ధ్రువపత్రాల ముఠాలు.. పట్టుబడుతూనే ఉన్నాయి. అక్రమాలకు పాల్పడిన కొందరు నిందితులు జైలుకెళ్లి వచ్చిన తర్వాత.. తిరిగి అదే దందా కొనసాగిస్తున్నారు. వారికి విదేశీవిద్య, జాబ్‌కన్సెల్టెన్సీలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి. ప్రైవేట్ హాస్టళ్ల వార్డెన్లు, వాచ్ మెన్, సిబ్బంది నిరుద్యోగులను గుర్తించి.. నకిలీ సర్టిఫికెట్ ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నారు.
వన్‌సిట్టింగ్ పరీక్షలు, కాలేజీకి వెళ్లకుండా డిగ్రీ అంటూ నమ్మించి.. బోగస్ సర్టిఫికెట్లు చేతిలో పెడుతున్న ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. అసలు వన్ సిట్టింగ్ విధానం.. అమల్లోలేదని అధికారులు చెబుతున్నా అక్రమార్కులు చెప్పే మాటలకు కొందరు మోసపోతున్నారు. నకిలీ సరిఫికెట్లు విక్రయిస్తున్న ముఠాలపై కఠినచర్యలు చేపడుతున్న పోలీసులు పీడీ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు.
ఇవీ చదవండి: