Fake Doctor Arrested: వైద్యుడి గెటప్‌లో నేరుగా ఆస్పత్రి ఐసీయూలోకి ప్రవేశించి.. రోగి బంధువుల నుంచి డబ్బులు లాగుదామని ప్రయత్నించి చివరకు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు ఓ యువకుడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలను పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఈ నెల 16న బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించారు. రోగికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అదే రోజు గుర్తుతెలియని వ్యక్తి వైద్యుడి వేషధారణతో ఐసీయూలోకి వెళ్లాడు. రోగి కేసు షీట్‌ను పరిశీలించి రోగి సహాయకుడి ఫోన్ నంబరు తీసుకున్నాడు. వాళ్లకు ఫోన్ చేసి అత్యవసర శస్త్రచికిత్స చేయాలని, తక్షణం రూ.50 వేలు పంపించాలని చెప్పాడు.
విస్తుపోయిన బంధువులు తమకు ఈఎస్‌ఐ వర్తిస్తుందని, డబ్బులెందుకు ఇవ్వాలంటూ ప్రశ్నించారు. ఈఎస్‌ఐ కార్డు ద్వారా వచ్చిన వారికి రూ. 12,500 రాయితీ ఇస్తున్నామని.. మిగతా డబ్బు చెల్లించాలని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన రోగి బంధువులు.. ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. వారు ఆరా తీయగా సదరు వ్యక్తి నకిలీ డాక్టర్ అని తేలింది. ఆస్పత్రి సెక్యూరిటీ అధికారి సాగర్ చారి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుడిని సంతోష్‌నగర్‌కు చెందిన మహ్మద్ జకీరుద్దీన్(19)గా గుర్తించారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చదవండి: 'మాపై అత్యాచారాలు ఆపండి'.. కేన్స్‌లో నగ్నంగా ఉక్రెయిన్ మహిళ నిరసన