మాదకద్రవ్యాల కేసులో నిందితులపై సమన్లు, వారంట్ల అమలులో ఆబ్కారీ శాఖ నిర్లక్ష్యం (Excise department negligence ) కారణంగా.. అభియోగపత్రాల్లో విచారణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. సుమారు నాలుగున్నరేళ్ల పాటు సుదీర్ఘ విచారణ జరిపి.. (Tollywood stars got clean chit) సినీ తారలు, సెలబ్రిటీలకు క్లీన్‌చిట్ ఇచ్చిన ఎక్సైజ్ శాఖ.. నిందితులపై ఛార్జిషీట్లు దాఖలు చేసింది. నాంపల్లి, రంగారెడ్డి కోర్టుల్లో 12 అభియోగపత్రాలను సమర్పించింది. అయితే చాలా మంది నిందితులు సహకరించకపోవడంతో విచారణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కరోనా పరిస్థితుల కారణంగా కోర్టుల్లో కేసుల విచారణ ప్రక్రియ పాక్షికంగా నిర్వహించడాన్ని కూడా నిందితులు అవకాశంగా తీసుకుంటున్నారు.
నిందితుడు సంతోష్ దీపక్‌పై నాంపల్లి కోర్టు 2019 జులై 1న నాన్‌బెయిలబుల్ వారంట్ జారీచేసింది. రెండేళ్లు గడిచినా... సంతోష్ దీపక్‌ను సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు హాజరు పరచలేకపోయారు. అతనికి బెయిల్ పూచీకత్తు ఇచ్చిన ష్యూరిటీలకు ఆగస్టు 24న న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అబుబాకర్ అలియాస్ సొహైల్‌పై ముషీరాబాద్ ఎక్సైజ్ అధికారులు 2018 నవంబరులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి సొహైల్‌పై నాన్‌బెయిలబుల్ వారంట్ పెండింగులో ఉంది. సుమారు మూడేళ్లు కావస్తున్నా వారంట్ అమలు చేసి కోర్టులో హాజరు పరచలేదు. సొహైల్ ఆచూకీ లభించడం లేదని కోర్టుకు ఆబ్కారీ శాఖ తెలపడంతో.. బెయిల్ పూచీకత్తులు సమర్పించిన ష్యూరిటీలకు న్యాయస్థానం ఈనెల 21న నోటీసులు జారీ చేసింది.
చార్మినార్ ఎక్సైజ్ అధికారులు గతేడాది కుద్దూస్ మరో నలుగురిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. గత డిసెంబరు నుంచి నాలుగుసార్లు సమన్లు జారీ చేసిప్పటికీ.. ఆ కేసులో నిందితుడు కుందన్‌సింగ్ విచారణకు హాజరు కావడం లేదు. మహమ్మద్ జీషన్ అలీఖాన్, బెనార్డ్ విల్సన్‌పై నాంపల్లి ఎక్సైజ్ అధికారులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ కరోనా ప్రభావంతో ముందుకు సాగలేదు. నవంబరు 17న విచారణకు హాజరుకావాలని జీషన్, విల్సన్‌ను ఈనెల 21న నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే విదేశీయుడు మైక్ కమింగాపై.. శేరిలింగంపల్లి ఎక్సైజ్ అధికారులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై 2018 ఆగస్టు 16న కోర్టు విచారణకు స్వీకరించింది. రెండుసార్లు సమన్లు ఇచ్చాక కమింగా హాజరు కావడంతో కోర్టు విచారణ ప్రక్రియ ప్రారంభించింది. కోర్టు 2019 జనవరి 17న సాక్షుల విచారణ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. అయితే 2019 మే 14న ఎక్సైజ్ శాఖ సాక్షులను హాజరుపరచకపోవడంతో షెడ్యూల్‌ను కోర్టు రద్దు చేసింది. మళ్లీ షెడ్యూలు ఖరారు కావల్సి ఉంది.
శంషాబాద్ విమానాశ్రయంలో 2017లో అరెస్టయిన విదేశీయుడు రఫేల్ అలెక్స్ విక్టర్‌పై ఎక్సైజ్ శాఖ ఛార్జి షీట్‌ను 2018 జనవరి 9న రంగారెడ్డి కోర్టు విచారణకు స్వీకరించింది. జైలు నుంచి రఫేల్ అలెక్స్ విక్టర్‌ను హాజరుపరిచినప్పుడల్లా... న్యాయవాదిని నియమించుకునేందుకు సమయం కావాలని కోర్టును కోరారు. బెయిల్ వచ్చినప్పటి నుంచి కోర్టుకు హాజరుకావడం లేదు. దీంతో 2018 జులై 7న కోర్టు నాన్‌బెయిలబుల్ వారంట్ చేసింది. రఫేల్ అలెక్స్ విక్టర్ ఆచూకీ తెలియడం లేదని ఎక్సైజ్ శాఖ నివేదించడంతో.. 2019 జనవరి 9న బెయిల్ బాండ్లను జప్తు చేసి ష్యూరిటీలకు నోటీసులు జారీ చేసింది. రెండున్నరేళ్లు దాటినా ఇప్పటికీ నిందితుడు హాజరు కాలేదు.
అనీష్‌కుమార్, రితుల్ అగర్వాల్, రాహుల్ అగర్వాల్‌పై సికింద్రాబాద్ ఎక్సైజ్ దాఖలు చేసిన అభియోగపత్రం కొవిడ్ పరిస్థితుల కారణంగా ముందుకు సాగలేదు. విచారణ షెడ్యూల్ రూపొందించేందుకు ఈనెల 27కి వాయిదా పడింది. ముషీరాబాద్ ఎక్సైజ్ అధికారులు అర్ణవ్కుమార్ మండల్‌పై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను గతేడాది ఫిబ్రవరి 18న నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించి సమన్లు జారీ చేసింది. 8 సార్లు సమన్లు జారీ చేసిన తర్వాత నిందితుడు ఈ ఏడాది ఫిబ్రవరి 8న విచారణకు హాజరయ్యారు. తర్వాత 4 సార్లు విచారణ జరిగినప్పటికీ... న్యాయవాదిని నియమించుకునేందుకు సమయం కావాలంటూ కోరుతున్నాడు. ఈనెల 30న మరోసారి విచారణ జరగనుంది.
ఇదీచూడండి: TOLLYWOOD DRUGS CASE: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీకి సరైన ఆధారాలు దొరకలేదా..?