Attack with Knife on student: నల్గొండ జిల్లాకేంద్రంలో దారుణం జరిగింది. డిగ్రీ కళాశాల విద్యార్థినిపై ఓ ప్రేమోన్మాది హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రేమపేరుతో కొంతకాలంగా వేధిస్తున్న విద్యార్థి రోహిత్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ దాడిలో విద్యార్థినికి తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం విద్యార్థినికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
విద్యార్థిని తన స్నేహితురాలితో కలిసి ఫారెస్ట్ పార్క్‌కు వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థినిని పార్క్ నుంచి పక్కకు తీసుకెళ్లిన రోహిత్ కత్తితో మెడ, కడుపుభాగం, ముఖం, కాళ్లపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. కొంతకాలంగా రోహిత్ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని బాధితురాలి తండ్రి వెల్లడించారు. అతని ప్రేమను నిరాకరించడం వల్లే రోహిత్ దాడి చేశాడని ఆయన తెలిపారు. విద్యార్థిని తండ్రి... నిందితుడు రోహిత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జిల్లా కేంద్రంలోని పానగల్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని (21) స్థానిక ఎన్‌జీ కళాశాలలో ఇటీవలే బీబీఏ డిగ్రీ పూర్తి చేశారు. ఇదే కళాశాలలో నల్గొండకే చెందిన మీసాల రోహిత్ (21) డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నారు. ఇతడితో విద్యార్థినికి పరిచయం ఏర్పడటంతో ఇదే అదునుగా గత కొంత కాలం నుంచి తనను ప్రేమించమని ఒత్తిడి చేస్తున్నాడు. తనకు ఇష్టం లేదని యువతి పలుమార్లు తిరస్కరించడంతో ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనే దుర్బుద్ధితో రోహిత్ తన స్నేహితుడైన తాయిని సంప్రదించాడు.
రోహిత్ స్నేహితుడు తాయి తన స్నేహితురాలి ద్వారా విద్యార్థినిని మంగళవారం పట్టణంలోని ఒక పార్కుకు రప్పించారు. అప్పటికే అక్కడ రోహిత్ ఉండటంతో కంగారు పడిన విద్యార్థిని వెనక్కు వెళ్దామని ప్రయత్నించగా.. కాసేపు మాట్లాడుదామని రోహిత్ బలవంతం చేయడంతో పక్కకు వెళ్లింది. అదే సమయంలో మాట్లాడుతుండగానే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అప్పటికే తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో రోహిత్ పదిమార్లు విద్యార్థినిని పొడిచి పారిపోయాడు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని అక్కడే ఉన్న తాయి, మరో స్నేహితురాలు పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు, వైద్యులు వెల్లడించారు. బాధితురాలి తండ్రి రామలింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోపి వెల్లడించారు.
పథకం ప్రకారమే దాడికి కుట్ర..!
యువతిపై పథకం ప్రకారమే దాడి చేశానని పోలీసులకు రోహిత్ వెల్లడించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దాడికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. గతంలో అతడితో బాధితురాలు సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలు సైతం బయటకు రావడంతో ఇద్దరి మధ్య ఏ విషయంపై భేదాభిప్రాయాలు వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి విషయం నిందితుడు రోహిత్ స్నేహితుడు అయిన సాయికి ముందే తెలుసా... అనే విషయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. రోహిత్ గత చరిత్రపైనా సమగ్ర దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ కుట్రలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో అతడిని విచారిస్తున్నారు.
ఇవీ చదవండి: బ్లడ్ బ్యాంక్ నిర్లక్ష్యం.. తలసేమియా చిన్నారికి హెచ్ఐవీ..!