‘మీ ఫోన్‌లో వాట్సాప్‌ను అప్‌డేట్ చేసేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. పింక్ లుక్‌తో కొత్త ఫీచర్లను ఆస్వాదించండి..’
‘అమెజాన్ ప్రైమ్ అద్భుతమైన ఆఫర్.. ఉచితంగా పొందాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి..’
‘సినిమాలు, సిరీస్‌లు, ఐపీఎల్ మ్యాచ్‌లు మీ మొబైల్‌లోనే హెచ్‌డీ నాణ్యతతో వీక్షించండి.. ఉచితంగా ప్రత్యక్ష ప్రసారాల కోసం ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి..’
ప్రస్తుతం ఫోన్లు, వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమవుతున్న సంక్షిప్త సందేశాలివి. వీటితోపాటు వచ్చే లింక్‌ను పొరపాటున క్లిక్ చేస్తే చాలు ఫోన్‌లోకి వైరస్ ప్రవేశిస్తోంది. వెంటనే సదరు ఫోన్ సైబర్ నేరస్థుల స్వాధీనంలోకి వెళ్లిపోతోంది. సైబర్ నేరస్థులు ఆయా సంస్థల పేర్లను వినియోగించుకొని లింకుల్ని పంపిస్తున్నారు. పొరపాటున దానిని క్లిక్ చేస్తే స్పామ్ రూపంలో వైరస్‌లు ఫోన్లోకి చొరబడుతున్నాయి. డేటా చోరీకి గురవుతోంది. ఫోన్లో రహస్య సమాచారమేదైనా ఉంటే వాటిని చూపి బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులనూ డిమాండ్ చేస్తున్నారు. లింక్‌ల్ని తెరవగానే ‘ఆన్‌లైన్ స్ట్రీమ్’కు అనుమతి ఇవ్వాలని నేరగాళ్లు అడుగుతున్నారు. అనుమతి ఇస్తే దాని ఆధారంగా నేరస్థులు బల్క్‌గా లింక్‌ల్ని మనకు ప్రమేయం లేకుండానే మన ఫోన్‌లోని కాంటాక్టులకు పంపేస్తారు. వారూ వాటిని తెరుస్తూ ఇబ్బందుల పాలవుతున్నారు.
వెంటనే తొలగించాలి
ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ ఇప్పటికే ఆ లింక్‌ను గనక క్లిక్ చేసి ఉంటే అప్లికేషన్ లిస్ట్‌లోకి వెళ్లి పరిశీలించాలి. అందులో ‘ఆన్‌లైన్ స్ట్రీమ్’ యాప్‌ను రిమూవ్ లేదా అన్‌ఇన్‌స్టాల్ చేసి, ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి.
- నల్లమోతు శ్రీధర్, టెక్ నిపుణుడు
మాల్వేర్ ఉంటే డేటా చోరీ
సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న ఫోన్‌లలో వచ్చే లింక్‌లను క్లిక్ చేస్తే మాల్వేర్ ఉంది జాగ్రత్త అని హెచ్చరిక వస్తుంది. నిజానికి చాలావరకు ఫోన్లే ఇలాంటి తప్పుడు లింక్‌లు, సైట్‌లను నియంత్రిస్తుంటాయి. సెక్యూరిటీ ఉన్న సైట్‌లనే అనుమతిస్తాయి. అలా కాకుండా ‘గోహెడ్’పై క్లిక్ చేస్తే లింక్ తెరుచుకుంటుంది. మాల్వేర్ ఉంటే కచ్చితంగా డేటా చోరీ అయ్యే అవకాశం ఉంది.
- కె.వి.ఎం.ప్రసాద్, సైబర్ క్రైమ్ ఏసీపీ
- ఇదీ చదవండి : ఈ 'పింక్' లింక్ మీకూ వచ్చిందా?