మేడ్చల్ జిల్లా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి(mla subhash reddy)పై చర్యలు తీసుకోవాలని భాజపా(BJP) నాయకులు బాలానగర్ ఏసీపీ కార్యాలయం, జగద్గిరిగుట్ట పీఎస్లో ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని కాప్రా ప్రాంతంలో 90 ఎకరాల భూ వివాదం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేతో పాటు భూ కబ్జా కేసులో ఉన్న తహసీల్దార్ గౌతమ్ కుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం కృషి చేయాల్సిన ప్రజాప్రతినిధులే భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన అధికారులే తప్పుదోవ పడుతున్నారని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వ భూములతో పాటు, చెరువు, దేవాదాయాల భూములు, అసైన్డ్ భూములు, కస్టోడియన్ భూములను కబ్జాల నుంచి కాపాడాలన్నారు. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిపై నమోదైన భూ కబ్జా కేసులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: Covid Effect: రాష్ట్ర అవతరణ వేడుకల రద్దుకు ప్రభుత్వ యోచన