కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఫ్లిప్‌కార్ట్ (Flipcart) పేరు మీద ఘరానా మోసాలకు పాల్పడుతున్న కొరియర్ బాయ్స్‌ని పోలీసులు పట్టుకున్నారు. మోసాలకు పాల్పడి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారని హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డి (Huzurabad Acp Kotla Venkat reddy) పేర్కొన్నారు. సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన నీర్ల కల్యాణ్, ఆనగొని వికాస్, కనుకుంట్ల అనిల్, తూటి వినయ్‌లు హుజూరాబాద్ పట్టణంలోని లార్జ్ లాజిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఫ్లిప్‌కార్ట్ కొరియర్ బాయ్‌గా మూడు నెలల నుంచి పనిచేస్తున్నారు. కంపెనీకి సంబంధించిన కొరియర్‌లోని వస్తువులను దొంగిలించి వాటి స్థానంలో రాళ్లు, చపాతి బండలు, పెంకులు పెట్టేవారు. దొంగిలించిన వస్తువులను అమ్ముకొని వచ్చిన డబ్బులతో జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నారని హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్ రెడ్డి తెలిపారు.
యూట్యూబ్‌లో చూసి...
నిందితులు యూట్యూబ్‌లో చూసి ఇలాంటి తరహా నేరాలను ఎలా చేయాలో నేర్చుకున్నారని ఏసీపీ వివరించారు. నిందితులు వారు డెలివరీ చేసే రూట్లో వారి పేరుపై కొన్ని, వారి బంధువులు, ఫ్రెండ్స్ పేర్లపై విలువైన వస్తువులను ఫ్లిప్‌కార్ట్ ఆర్డర్స్ బుక్ చేసుకుంటారని... తర్వాత ఆ వస్తువులు హుజురాబాద్‌లోని ఫ్లిప్‌కార్ట్ హబ్‌కి రాగానే... వాటిని డెలివరీ కోసం వారి పేరుపై అసైన్ చేసుకొని సైదాపూర్‌కి తీసుకెళ్లేవారని ఏసీపీ పేర్కొన్నారు. అక్కడ ముందుగానే అనుకున్నట్లు బుక్ చేసిన ఫోన్ నంబర్‌కి ఫోన్ చేసి మిత్రుల ద్వారా ఆయా ఆర్డర్స్ రిజెక్ట్ చేయడం, ఆర్డర్ చేసిన ఫోన్ నంబర్‌ను స్విచ్ ఆఫ్ పెట్టడం, కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండడం, కస్టమర్ నుంచి రెస్పాన్స్ లేదు అని చెప్పేవారని తెలిపారు.
పెంకులు, రాళ్లు పెట్టి...
తర్వాత నిర్మానుష్య ప్రదేశంలో వాటిని కత్తిరించి వస్తువులను తీసుకుని అందులో రాళ్లు, పెంకులు, చపాతి బండలను వస్తువుల బరువు తగినట్లుగా పెట్టి వాటిని మళ్లీ కంపెనీకి రిటర్న్ చేసేవారని ఏసీపీ వెల్లడించారు. తర్వాత ఆ ఖరీదైన వస్తువులను అమ్ముకొని వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారని ఏసీపీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఫ్లిప్ కార్ట్ కంపెనీ టీం లీడర్‌గా పని చేస్తున్న ముప్పు నవీన్‌కు అనుమానం వచ్చింది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారించగా దర్యాప్తులో ఈ తరహాలో చాలా వస్తువులను దొంగిలించినట్లు తేలిందని వివరించారు.
పక్కా సమాచారం మేరకు ఈరోజు ఉదయం 12 గంటలకు నిందితులు మళ్లీ ఈ తరహా నేరాలు చేయడం కోసం సైదాపూర్ బస్టాండ్ వద్ద వేచి ఉన్న తరుణంలో పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు వారి వద్ద నుంచి రూ. 9 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వివరించారు. నిందితులను పట్టుకున్న హుజూరాబాద్ రూరల్ సీఐ ఏర్రల కిరణ్, పోలీస్ సిబ్బందిని ఏసీపీ వెంకట్ రెడ్డి అభినందించారు.
ఇదీ చదవండి: preparations: పంటల కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా ఏం చేద్దాం..!