హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. భవానీనగర్‌లో మూడేళ్ల బాబును తన పిన్ని భవనం పైనుంచి కిందకు తోసింది. ఈదిబజార్‌లోని కుమ్మరివాడలో అహ్మద్ ఉద్దీన్‌కు ఐష అనే మహిళతో ఏడాది క్రితం వివాహం జరిగింది. భర్త సోదరుడు మహ్మద్ ఏతేషాం కుమారుడు నుమాన్ ఉద్దీన్ తరచూ వీరింటికి వెళ్తుంటాడు. ఉదయం నుమాన్‌ను ఇంటి పైకి తీసుకువెళ్లిన ఐష... రెండస్థుల భవనంపై నుంచి కిందకు తోసింది.
ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... నిందితురాలు ఐషను అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని తానే భవనంపై నుంచి విసిరేసినట్లు ఆమె అంగీకరించింది. వివాహం జరిగి ఏడాది అవుతున్నా... తనకు పిల్లలు పుట్టనందునే దారుణానికి ఒడిగట్టినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై భవనీనగర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.