గొర్రెల కొట్టంపై వీధి కుక్కలు దాడి చేయడంతో 25 మూగ జీవాలు మృతి చెందాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పోల్కంపేటలో గొర్రెల కొట్టంపై మంగళవారం అర్ధరాత్రి వీధి కుక్కలు దాడి చేసి... గడ్డి లింగంకు చెందిన 20 గొర్రెలు, ఐదు మేకలను చంపేశాయి.
గడ్డి లింగం రోజువారీ మాదిరి గానే గొర్రెలు, మేకలను కొట్టంలో కట్టివేశాడు. కొట్టంలో కుక్కల చప్పుడు రావడంతో... రాత్రి ఒంటి గంట సమయంలో కొట్టంలోకి వెళ్లి చూడగా కుక్కల దాడిలో గొర్రెలు, మేకలు మృతిచెంది పడి ఉన్నాయి. ఘటనలో సుమారు 2,50,000 రూపాయల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరాడు.
స్థానికులు పశువైద్యాధికారి రవికుమార్‌కు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన జీవాలను పరిశీలించి పంచనామా నిర్వహించారు. ఆయన వెంట సర్పంచ్ పద్మ, ఉప సర్పంచ్ ఛత్రం రామానుజా చారి, వెటర్నరీ సిబ్బంది సుధాకర్, శివాలాల్, తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి : ఐదు గ్రామాల్లో కోలుకున్న 405 మంది కొవిడ్ బాధితులు