Thief arrested : కుమురంభీం ఆసిఫాబాద్ సహా పలు జిల్లాల్లో కొన్ని నెలలుగా వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా.. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసి.. నిందితుడిని పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ సురేశ్‌కుమార్ తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూసిన పలువురు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని సిర్పూర్ టీ మండలం వెంకట్రావుపేటలో అరెస్టు చేశారు. కొన్ని నెలల క్రితం కాగజ్‌నగర్, కౌటాలలో పలు చోరీలను ఇతడే చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అతడి నుంచి 69 గ్రాముల బంగారం, రూ.16 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా అపహరించిన సొత్తును కొనుగోలు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ఓ వ్యక్తి.. గత రెండేళ్లుగా పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. 2020, 21లో కాగజ్‌నగర్‌లో, 2021లో కౌటాలలోని శివాలయంలో, కాగజ్‌నగర్‌లో ఓ బ్యాంకులోను ఇలా పలు దొంగతనాలకు పాల్పడినట్లు తేలింది. సీసీటీవీ దృశ్యాలను సోషల్‌మీడియాలో వైరల్ చేయడంతో నిందితుడిని అరెస్టు చేశాం. నిందితుడి నుంచి 800 ఏళ్లనాటి పురాతన విగ్రహాలు, 69గ్రాముల బంగారం, 16వేల నగదును స్వాధీనం చేసుకున్నాం. - సురేశ్‌కుమార్, ఎస్పీ
ఇదీ చూడండి : Honor Killing in Sangareddy: ప్రేమ పేరుతో పరువు తీస్తోందని.. ప్రియుడితో కలిసి బిడ్డను చంపేసిన తల్లి