యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని సోమారం గ్రామంలో శీలం రంగారెడ్డి(72)- ప్రమీల(62) వృద్ధ దంపతులు నివాసముండేవారు. వయస్సు మీద పడిన వారు.. ఎటూ వెళ్లలేని పరిస్థితి. బుక్కెడు బువ్వ వండుకుందామన్నా.. శరీరం సహకరించని దుస్థితి.
కాటికి కాలు చాపిన వయస్సులో కన్నపిల్లలకు భారం కావద్దనుకున్నారు. ఇన్నేళ్లు ఎవ్వరిపై ఆధారపడకుండా కష్టం చేసుకుని బతుకీడ్చిన వాళ్లు.. మలివయస్సులో మరొకరి ముందు చేయిచాచొద్దని భావించారు. ఏళ్ల తరబడి ఒకరికొకరుగా బతికి, కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడున్న ఆ దంపతులు.. చావులోనూ ఒక్కటయ్యారు. ఇక తమతో ఎవరికి ఏ అవసరం లేదనుకున్నారో ఏమే పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నారు. తమతో కలివిడిగా ఉండే ఆ వృద్ధులు కానరాని లోకాలకు వెళ్లారంటే నమ్మశక్యంగా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.