పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రశాంత్ నగర్‌కు చెందిన సీపీఎం నాయకుడు, సింగరేణి మాజీ కార్మికుడు బండారి మొగిలి హత్య కేసు నిందితులను అరెస్టు చేసినట్లు పెద్దపల్లి డీసీపీ రవీందర్ తెలిపారు. గోదావరిఖని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గోదావరిఖని ప్రశాంత్ నగర్‌కు చెందిన మొగిలి గతంలో పలువురికి ఖాళీ స్థలాలను ఇప్పించారని తెలిపారు. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు భూమి విషయంలో ఆయనతో గొడవకు దిగినట్లుగా పేర్కొన్నారు.
భూమి దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఆయనను హతమార్చాలని ఈ నెల 5న అతని ఇంటి నుంచి తీసుకెళ్లి... సమ్మక్క-సారలమ్మ గద్దెల సమీపంలోని దాడి చేసి హతమార్చారని వెల్లడించారు. మల్కాపూర్ చెరువు కట్ట వద్ద ఆయన మృతదేహాన్ని పడేశారని వివరించారు. నిందితులు చీమల తిరుపతి, బోనగిరి రాజేంద్రకుమార్, రాజశేఖర్‌లను అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. హత్య జరిగిన కొద్ది రోజుల్లోనే నిందితులను పట్టుకున్న గోదావరిఖని ఒకటో పట్టణ సీఐ రమేశ్ బాబుతో పాటు సిబ్బందిని అభినందించారు.
ఇదీ చదవండి: వేసవిలో విద్యుత్ కొరత లేకుండా చూసుకోండి: ఏపీ సీఎం జగన్