Woman killed in Gudivada: వివాహేతర సంబంధం వద్దు అన్నందుకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా గుడివాడలో ఓ మహిళను టిన్నర్ పోసి తగలబెట్టాడు ఓ ప్రబుద్దుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బాపూజీనగర్‌కు చెందిన వివాహిత (38) ఈ నెల 12వ తేదీన కాలిన గాయాలతో గుడివాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. గతంలో ఆమె తన పెంపుడు కుక్కకు పేలు (గోమార్లు) తీసి అవి మొత్తం కట్టెల పొయ్యిలో వేసి తగుల బెడుతూ గాయపడినట్లు పోలీసులకు తెలిపింది.
అనంతరం ఆమె పరిస్థితి విషమంగా మారడంతో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆమెకు స్థానికంగా ఉండే పచ్చా వెంకటేశ్వరరావుతో వివాహేతర సంబంధం ఉందని, అతనికి రూ. లక్ష అప్పుగా ఇచ్చానని వెల్లడించింది. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలిసి అతనితో కలవొద్దని వారించగా వెంకటేశ్వరరావును ఇంటికి రావొద్దని వివాహిత చెప్పింది. అతను ఎప్పటిలాగే ఈ నెల 12న వివాహిత ఇంటికి రాగా వెళ్లిపోవాలని కోరింది.
లెక్కచేయని వెంకటేశ్వరరావు ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆమె వ్యతిరేకించడంతో కోపంతో రగిలిపోయిన నిందితుడు తన వెంట తెచ్చుకున్న టిన్నర్‌ను ఆమెపై పోసి నిప్పంటించాడు. నాటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం మృతి చెందింది. ఈ మేరకు సెక్షన్ 302 కింద అతనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కె.గోవిందరాజు తెలిపారు.
ఇవీ చదవండి: