సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీమ్‌తో దర్యాప్తు ప్రారంభించారు.
మంతూర్ గ్రామానికి చెందిన మానెమ్మ గత కొన్ని నెలలుగా భర్త మానెయ్యతో విడిపోయి.. సోదరుడి ఇంట్లో ఉంటోంది. కూతురుని ఈ మధ్యే.. అన్న కొడుకుకే ఇచ్చి వివాహం జరిపించింది. ఈ నెల 14న ఆ ఇంట్లో జరిగిన ఓ శుభకార్యం అనంతరం.. ఆమె అదృశ్యమైంది. కుటుంబసభ్యులు.. రెండు రోజులుగా ఆమె ఆచూకీ కోసం వెతికారు. చివరకు ఇంటి వెనకాలే ఉన్న మొక్కజొన్న చేనులో మృతదేహాన్ని గుర్తించి.. శోక సంద్రంలో మునిగారు.
సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతురాలి గొంతు పైనున్న పదునైన కత్తి పోట్లను పరిశీలించారు. ఆమె మెడలోని ఆభరణం మాయమైనట్లు గుర్తించి.. బంగారం కోసమే గుర్తు తెలియని వ్యక్తులు ఈ హత్యకు పాల్పడ్డారా..? లేక మరేదైనా బలమైన కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ బాలాజీ వెల్లడించారు.
ఇదీ చదవండి: 'అందంగా లేవు... అదనపు కట్నం కావాలి...' ఓ వివాహిత బలి!