ఉపాధికోసం ఊరుగాని ఊరొచ్చిన ఓ యువతికి మాయమాటలు చెప్పి లోబరుకున్నాడో మాయగాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. కొన్ని రోజులకు అతని అసలు రూపం బయటపెట్టాడు. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని వేధించడం మొదలు పెట్టాడు. చివరికి మొహం చాటేయడంతో... బాధితురాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఈ ఘటన హైదరాబాద్ యూసఫ్‌గూడలోని రహమత్‌నగర్‌లో జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ జరిగింది..
ఏపీలోని ప్రకాశం జిల్లా ఉయ్యాలవాడ మండలం సింగంపల్లికి చెందిన మలపతి రామకృష్ణ ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చి రహమత్‌నగర్‌లో ఉంటున్నాడు. కొంతకాలంగా సినిమాల్లో అర్టిస్టుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తనతో పాటే ఆర్టిస్టుగా పనిచేస్తున్న ఓ యువతితో పరిచయం అయింది. అది కాస్త ప్రేమచాటు వంచనకు దారితీసింది. ఇద్దరూ ఒకే చోట పనిచేస్తుండడం... మాయమాటలతో ఆకట్టుకోవడంతో అతడి ఉచ్చులో పడిపోయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి పలుమార్లు తన గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీరా గర్భం దాల్చిన తర్వాత ఇప్పుడే పిల్లలు వద్దని చెప్పి ఒప్పించి... గర్భస్రావం చేయించాడు.
అప్పుడు అతనిలో దాగిఉన్న మరో వ్యక్తి బయటపడ్డాడు. ఆమెను ఎలాగైన వదిలించుకోవాలని వేధించడం మొదలు పెట్టాడు. మాటలతోను, శారీరకంగా హింసించేవాడు. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోనని ముఖం చాటేయడంతో బాధిత యువతి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: Suicide: టిక్‌టాక్ స్టార్ భర్త ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా..?