Suicide in School: బాలికల గురుకుల పాఠశాల తరగతి గదిలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీ శ్రీకాకుళం జిల్లాలో కలకలం సృష్టించింది. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలానికి చెందిన ఓ బాలిక(16) జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అక్కడే పనిచేస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయురాలు విజయనగరం నుంచి రోజూ కారులో వచ్చి వెళ్తుంటారు. ఆమె కారు డ్రైవరు భార్గవసాయి రోజూ పాఠశాలలోకి వచ్చేవాడు. ఇదే అదనుగా భావించి అతడు బాధిత బాలికతో పరిచయం పెంచుకుని మాయమాటలు చెప్పి ప్రేమలోకి దింపాడు.
ఈ తతంగమంతా పాఠశాలలోనే ఐదారు నెలలుగా జరుగుతున్నా... సిబ్బంది ఎవరూ అతడిని అభ్యంతర పెట్టలేదు. అతడి మాయలో పడిన బాలిక చదువును నిర్లక్ష్యం చేసింది. ఇటీవల చెవినొప్పి కారణంగా 15 రోజులు ఇంటికి వెళ్లి ఆసుపత్రిలో చికిత్స తీసుకుని మళ్లీ పాఠశాలకు వచ్చింది. తర్వాత రెండురోజుల్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. డ్రైవర్ వేధింపులే దీనికి కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాలికలకు సంబంధించిన పాఠశాలలోకి విద్యార్థుల తల్లిదండ్రులు అడుగుపెట్టాలన్నా... ఎన్నో వివరాలు అడుగుతారని.. అలాంటిది ప్రైవేటు డ్రైవరును అనుమతించడమే తమ కుమార్తె మరణానికి కారణమైందంటూ పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు సంబంధించి డ్రైవర్ భార్గవసాయి, అధ్యాపకురాలు భవాని, ప్రిన్సిపల్ ఉషారాణిపై అట్రాసిటీ, పోక్సో, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, తాను డైరీలో రాసుకున్న విషయాలు ఎవరూ చదవొద్దని, అదే తన చివరి కోరిక అని పేర్కొంటూ బాలిక రాసినట్లు భావిస్తున్న ఓ లేఖ బయటపడింది. ఆమె ఆత్మహత్యతో పాఠశాలకు ఎలాంటి సంబంధం లేదని కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. మరోవైపు బాలిక ఆత్మహత్యకు బాధ్యుల్ని చేస్తూ ప్రిన్సిపల్ కె.ఉషారాణి, హౌస్‌టీచర్ మంజుల, ఆంగ్ల ఉపాధ్యాయిని భవానిని సస్పెండ్ చేస్తూ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయకర్త యశోదలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.